విశాఖపట్టణం: మోతీ మహల్‌ని కూల్చివేసినప్పుడు గత చరిత్ర బాబాయ్‌కి గుర్తు రాలేదా అని మాన్సాన్ ట్రస్ట్ చైర్‌పర్సన్‌ సంచయిత గజపతిరాజు ప్రశ్నించారు.

శనివారం నాడు మాన్సాన్ ట్రస్ట్ ఛైర్‌పర్సన్ సంచయిత గజపతిరాజు ఓ తెలుగు  న్యూస్ చానెల్‌తో  మాట్లాడారు. ట్రస్టు ఆశయాన్ని బాబాయ్ పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆమె ఆరోపించారు. మోతి మహల్ ను కూల్చినప్పుడు గుర్తుకు రాని గత చరిత్ర మూడు లాంతర్ల కూడలిని ధ్వంసం చేశారంటూ ఇప్పుడు మొసలి కన్నీరు కార్చుతున్నారని ఆమె విమర్శించారు.

తమ కుట్రలు ఎక్కడ బయటపడిపోతాయనే భయంతో వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆమె మండిపడ్డారు. మాన్సాన్ ట్రస్ట్ చైర్మెన్ గా నియామకం తర్వాత సంచయిత గజపతి రాజు బాబాయి ఆశోక్ గజపతి రాజుపై విమర్శల స్వరాన్ని మరింతగా పెంచారు.టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో ఆశోక్ గజపతి రాజు ఏం చేశారని ఆమె ప్రశ్నించారు.

సంచయిత గజపతిరాజు ట్రస్ట్ ఛైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత లాక్ డౌన్ నేపథ్యంలో అప్పన్న చందనోత్సవం భక్తులు లేకుండా తొలిసారిగా జరిగింది. ఎంపిక చేసిన అర్చకులు, ట్రస్ట్ ఛైర్మెన్, అదికారుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.