18 రూపాయలకు దొరుకుతున్న కిలో ఉప్పు శనివారం ఉదయం నుండి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పలువురు 150 రూపాయలు ఇచ్చి కొంటున్నట్లు పోలీసు అధికారులే అంగీకరిస్తున్నారు.
హటాత్తుగా ఉప్పుకష్టాలు మొదలయ్యాయి. పెద్ద నోట్ల రద్దుతో దేశమంతా చిల్లర సమస్యను ఎదుర్కొంటున్న వేళ తాజాగా ఉప్పుసమస్య కూడా తోడవ్వటంతో సర్వత్రా ఆందోళన మొదలైంది. శుక్రవారం రాత్రి నుండి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కిరాణా షాపుల ముందు ఉప్పు కోసం జనాలు బారులు తీరి నిలబడటం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.
హటాత్తుగా ఉప్పకు ఎందుకు ఇంత డిమాండ్ వచ్చిందంటే కిలో ఉప్పు త్వరలో రూ. 500కు చేరుకుంటోందన్న వదంతేనని తేలింది. ఉత్తరాది రాష్ట్రాల్లో కిలో ఉప్పు ధర 500కి చేరుకుందన్న ప్రచారమే ఈ మొత్తానికి కారణంగా తెలుస్తోంది. దాంతో ప్రజలందరూ శుక్రవారం రాత్రి నుండే షాపుల వద్ద క్యూల్లో నుల్చున్నారు. ఒకవైపు రద్దైన పెద్ద నోట్ల స్ధానంలో ఇంకా అందరికీ చిన్న నోట్లు అందుబాటులోకి రాకుండానే ఉప్పు సమస్య కూడా తెరమీదకు రావటంతో ఆందోళన మరింత పెరిగిపోయింది. మామూలుగా అయితే 18 రూపాయలకు దొరుకుతున్న కిలో ఉప్పు శనివారం ఉదయం నుండి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పలువురు 150 రూపాయలు ఇచ్చి కొంటున్నట్లు పోలీసు అధికారులే అంగీకరిస్తున్నారు.
ఇదే అదునుగా వ్యాపారస్తులు ఉప్పు ధరను మరింత ఎక్కువ ధరలకు అమ్ముకునే ఉద్దేశ్యంతో అమ్మకాలను నిలిపేస్తుండటంతో పలువురు మహిళలు దొంగతనాలకు కూడా పాల్పడుతున్నారు. హైదరాబాద్ లో ఇటువంటి ఘటనలు చాలా చోట్ల చోటుచేసుకుంటున్నాయి. అదే విధంగా తెలంగాణాలోని సంగారెడ్డి, మెదక్, ఖమ్మం, వరంగల్ ప్రాంతాలతో పాటు ఏపిలోని గుంటూరు, బాపట్ల, చిలకలూరిపేట, చిత్తూరు తదితర ప్రాంతాల్లో ఉప్పు కోసం జనాలు బారులు దీరి నిలబడుతుండటం ఆశ్చర్యంగా ఉంది.
