తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి పది వేలు ఇవ్వాలంటున్నాడని... అయితే ఆయనిచ్చే ఇలాంటి ఉచిత సలహాలు తమ ప్రభుత్వానికి అవసరం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. ప్రజల అభివృద్దే ద్యేయంగా సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదన్నారు. ముఖ్యమంత్రి ఈ విపత్కర సమయంలో బయటకు రావడం లేదని టిడిపి నాయకులు గగ్గోలు పెడుతున్నారని... అయితే ఆయన ఈ సమయంలో ప్రజల్లోకి వెళ్లకపోవడమే మంచిదన్నారు. ఆయన బయటకు వస్తే ప్రజలు ఆగుతారా..? అని సజ్జల అన్నారు. 

కరోనా వైరస్ నివారణకు సీఎం జగన్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అయితే ఈ కరోనా కంటే భయంకరమైన, అతి ప్రమాదకరమైన వ్యక్తి చంద్రబాబు నాయుడేనని... ఎన్టీఆర్ ఎందుకు పెట్టారో తెలియదు కాని నిజంగానే ఆయన వెన్నుపోటుదారుడని అన్నారు. ప్రభుత్వంపై విష ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్టఅని... అయితే ఈ విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వంపై విషప్రచారం చేస్తూ ప్రజలను గందరగోళం పరుస్తున్నాడని సజ్జల మండిపడ్డాడు.

కరోనా కేసులను గుర్తించేందకు జగన్ ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటింటి సర్వే చేయిస్తోందని అన్నారు. అలాగే లాక్ డౌన్ సమయంలోనూ వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నారని అన్నారు. కానీ చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చోని ఎవరెవరికో లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. 

కరోనా టెస్టులు చేయడంలో దేశంలోనే ఏపి మొదటి స్థానంలో ఉందన్నారు. ఇంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వ కార్యక్రమాలపై చంద్రబాబు దుష్ర్పచారం కొనసాగుతూనే వుందన్నారు. చంద్రబాబులా జగన్ కి చేసిన పని గురించి గొప్పలు చెప్పుకోవడం తెలియదన్నారు.  

కరోనా కట్టడిలో అధికారులకు సీఎం పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని సజ్జల పేర్కొన్నారు. గుజరాత్ నుంచి మత్స్యకారులను రాష్ట్రానికి తీసుకురావడానికి స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగారని... ఇది ఆయన పనితీరు అని కొనియాడారు. 

చంద్రబాబు ఇంకా తానే ముఖ్యమంత్రి అనే భావనలో ఉన్నారని... అందువల్లే ఆయన పైత్యం పరాకాష్టకు చేరిందని విమర్శించారు. చంద్రబాబు సలహాలు ప్రభుత్వానికి అవసరం లేదన్నారు. అఖిలపక్షం సమావేశం పెట్టాలని అడిగే అర్హత చంద్రబాబు కు లేదన్నారు. అయినా పది రాజకీయ పార్టీల సమావేశం పెట్టి చర్చించే అంశం  కరోనా కాదన్నారు. ...చంద్రబాబు ఎప్పుడైనా అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేశారా... ప్రత్యేకంగా హోదా మీద  అఖిలపక్షం ఏర్పాటు చేయమంటే చంద్రబాబు చేశారా..?అని సజ్జల ప్రశ్నించారు. 

డ్వాక్రా మహిళలకు 14 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని... అయితే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 1400 కోట్లు వడ్డీ లేని రుణాలు మహిళలు కేటాయించిన ఘనత జగన్ దే అని ప్రశంసించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి జగన్ ఒకేసారి దైర్యంగా నిర్ణయం తీసుకున్నారని అన్నారు.  సీఎం నిర్ణయాన్ని స్వాగతించాల్సింది పోయి టీడీపీ నేతలు విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు.