తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విభజన సమస్యలపై దృష్టి సారించిన కేంద్ర హోం శాఖ.. కీలక సమావేశం ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ సమావేశం అజెండాలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చింది. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) సంతోషం వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విభజన సమస్యలపై దృష్టి సారించిన కేంద్ర హోం శాఖ.. కీలక సమావేశం ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ ఆశిష్ కుమార్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ నెల 17న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే సమావేశంలో ఏపీ ప్రత్యేక హోదాతో పాటుగా తొమ్మిది అంశాలను అజెండాలో చేర్చింది. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) సంతోషం వ్యక్తం చేశారు. నాడు ఏపీని అన్యాయంగా విభజించారని అన్నారు. తమకు న్యాయంగా అందాల్సినవి రాలేదని తెలిపారు. పార్లమెంట్‌లో తమ వాయిస్‌ను బలంగా వినిపించామని చెప్పారు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సజ్జల.. అనంతరం శ్రీకాళహస్తి ముక్కంటి సేవలో పాల్గొన్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చర్చలు జరుగుతున్నాయని.. కానీ పూర్తిగా న్యాయం చేయాల్సి ఉందన్నారు. ప్రత్యేక హోదాపై అడిగే హక్కు ఏపీకి ఉందని చెప్పారు. ఏపీకి న్యాయంగా రావాల్సినవి ఏవీ రాలేదని.. అందులో హోదా కూడా ఒకటని అన్నారు. న్యాయంగా ఏపీకి దక్కాల్సిన వాటిని అందేలా చేయడం కేంద్రం బాధ్యత అని అభిప్రాయపడ్డారు. ఈ అంశం కేవలం సమావేశాలకే పరిమితం కాకూడదన్నారు.
తెలంగాణ నుంచి కూడా రావాల్సింది చాలా ఉందని.. మళ్లీ న్యాయసమీక్షకు పోకుండా ఈ సమస్యను వీలైనంత త్వరగా కేంద్రం పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం వైపు నుంచి పీఆర్సీ వివాదం ముగిసిందన్నారు.
ఇక, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. కేంద్ర హోంశాఖ ఎంజెండాలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చారు. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై దృష్టి సారించిన కేంద్ర హోం శాఖ.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కేంద్ర హోం శాఖ లేఖలు రాసింది. ఈ నెల 17 విభజన సమస్యలపై సమావేశం నిర్వహించనున్నట్టుగా తెలిపింది. పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది.
ఈనెల 8న జరిగిన సమావేశంలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఆశిష్ కుమార్, ఏపీ నుంచి ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును నియమించింది. ఈనెల 17న ఉదయం 11 గంటలకు కమిటీ తొలి భేటీ నిర్వహణకు సిద్దమైంది. దీనిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు. ఇక, ఈ సమావేశంలో తొమ్మిది అంశాలపై చర్చించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది.
అజెండాలోని అంశాలు
1. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన
2. ఏపీ, తెలంగాణల మధ్య విద్యుత్ పంపిణీ
3. రెండు రాష్ట్రాల మధ్య పన్ను బకాయిలు
4. రెండు రాష్టాలకు సంబంధించిన బ్యాంకులో ఉన్న నగదు, డిపాజిట్లు
5. ఏపీఎస్‌సీఎస్‌సీఎల్, టీఎస్‌సీఎస్‌సీఎల్ మధ్య నగదు ఖాతాల విభజన
6. రాయలసీయ, ఉత్తరాంధ్ర 7 వెనకబడిన జిల్లాల అభివృద్దికి గ్రాంట్
7. ఏపీ-తెలంగాణ మధ్య వివిధ వనరుల పంపిణీ
8. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చ
9. పన్ను ప్రోత్సహకాలు
