‘బ్రో’’ చిత్రంపై వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు హీరో సాయిథరమ్ తేజ్.  సినిమాలకు రాజకీయాలకు ముడిపెట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 

‘‘బ్రో’’ చిత్రంపై వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు హీరో సాయిథరమ్ తేజ్. మంగళవారం చిత్ర యూనిట్‌తో కలిసి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అంబటి రాంబాబు మీద జోకులు వేసే ఉద్దేశంతో ఆ సీన్ తీయలేదని స్పష్టం చేశారు. సినిమాని సినిమాగానే చూడాలని సాయితేజ్ క్లారిటీ ఇచ్చారు. సినిమాలకు రాజకీయాలకు ముడిపెట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తనకు రాజకీయ అనుభవం లేదని.. మా మామయ్య పవన్ కళ్యాణ్‌కు మా కుటుంబ సభ్యులందరూ సపోర్ట్ చేస్తారని సాయిథరమ్ తేజ్ పేర్కొన్నారు. మాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదన్నారు.

మామయ్య పవన్ కళ్యాణ్ పక్కన నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. బ్రో చిత్ర కథ వినగానే ఎప్పుడెప్పుడు చేస్తానా అని ఆత్రుతగా ఫీలయ్యానని సాయిథరమ్ తేజ్ వెల్లడించారు. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ చనిపోయినప్పుడు నిజంగానే మరణించానా అని మూడు గంటల పాటు ఏడ్చానని ఆయన గుర్తుచేసుకున్నారు. మా మామయ్యకి దూరమై పోతున్నాననే బాధతో ఏడ్చానని సాయిథరమ్ తేజ్ వెల్లడించారు.

ALso Read: ‘బ్రో’పై అంబటి రాంబాబు మరోసారి వెటకారం

ఎప్పుడెప్పుడు చిరంజీవితో నటించే అవకాశం వస్తుందని వేయికళ్లతో ఎదురు చూస్తున్నానని ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. మల్టీస్టారర్ చిత్రాలలో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని మంచి కథ వస్తే కచ్చితంగా చేస్తానని సాయితేజ్ చెప్పారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక షార్ట్ ఫిలిం చేశామని...దానిని ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు.