Asianet News TeluguAsianet News Telugu
breaking news image

మత్స్యకారులకు భరోసా.. ఏపీలో 4వేల వేట పడవలకు శాటిలైట్ సిస్టమ్‌

గత ప్రభుత్వ హయాంలో ఐదు హార్బర్లకు టెండర్లు పిలిచి సొంతవారికే కట్టబెట్టారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆ పనులు ప్రారంభించేందుకు అప్పటి ప్రభుత్వం 40 శాతం నిధులు కూడా చెల్లించిందన్నారు. రెండోసారి నాలుగు హార్బర్లను అప్పటి ఎమ్మెల్యేకు, ఆయన తమ్ముడికి ఇచ్చారని ఆక్షేపించారు. 

Safety for fishermen.. Satellite system for 4 thousand fishermen boats in AP GVR
Author
First Published Jul 10, 2024, 6:49 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యశాఖ పరిస్థితి చూస్తుంటే చాలా బాధ కలుగుతోందని వ్యవసాయ, సహకార, గిడ్డంగులు, పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ నగరం పెనమలూరులోని మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయంలో ఆ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా నేడు (బుధవారం) జాతీయ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులు అందరికీ అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత తొలిసారి మత్స్యశాఖపై రివ్యూ నిర్వహించానని తెలిపారు. గత ప్రభుత్వంలో మత్స్యశాఖ ఉందా అనేలా తయారుచేశారని వ్యాఖ్యానించారు. మత్స్యకారులకు డీజిల్ రాయితీ గత ప్రభుత్వంలో రూ.10కోట్ల బకాయి ఉందని, ఆ బకాయిలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. మత్స్యశాఖలో నెలకొన్న పరిస్థితులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానన్నారు. మత్స్యశాఖ అభివృద్ధి విషయంలో కేరళ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలపై అధ్యయనం చేయాలని, క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనించాలని అధికారులకు ఆదేశించారు. 


మత్స్యకార భృతిపై కీలక ఆదేశాలు...

గత ప్రభుత్వంలో మత్స్యకారులకు వేట నిషేధిత సమయంలో ఇచ్చే భృతిని నిష్పక్షపాతంగా ఇవ్వలేదని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. చాలాచోట్ల అనర్హులకు అందజేశారన్నారు. ఈ నేపథ్యంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే పరిహారం, లబ్ధిదారులపై  రీసర్వే చేసి 20 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. మత్స్య పరిశ్రమ ఉత్పత్తుల సామర్థ్యం పెంచాలని, ఎగుమతుల వృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. 947 కిలోమీటర్ల సుదీర్ఘ సాగర తీరం ఉన్న మన రాష్ట్రంలో మత్స్య ఉత్పత్తికి, ఎగుమతులకు ఉన్న అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. 

ఆ కార్యక్రమాలపై పున:పరిశీలన...

గత ప్రభుత్వ హయాంలో ఐదు హార్బర్లకు టెండర్లు పిలిచి సొంతవారికే కట్టబెట్టారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆ పనులు ప్రారంభించేందుకు అప్పటి ప్రభుత్వం 40 శాతం నిధులు కూడా చెల్లించిందన్నారు. రెండోసారి నాలుగు హార్బర్లను అప్పటి ఎమ్మెల్యేకు, ఆయన తమ్ముడికి ఇచ్చారని ఆరోపించారు. ఈ నాలుగింటిలో రెండు హార్బర్లు పనిచేయడం లేదని, ఈ నేపథ్యంలో 2019-24 మధ్య కాలంలో మత్స్యశాఖలో అమలు చేసిన కార్యక్రమాలపై పున:పరిశీలన చేసి నివేదికలు అందజేయాలని సూచించారు. బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, ఓడరేవు, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ల ప్రస్తుత స్థితిగతులపై నివేదిక సమర్పించాలన్నారు. అలాగే, 2014-2019 మధ్య మత్స్యశాఖ అమలు చేసిన పథకాలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మత్స్యశాఖకు సంబంధించిన ఆర్థిక పరిస్థితులపై నివేదికలు రూపొందించినట్లయితే జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో వాటికి ఆమోదం లభించేలా ప్రయత్నం చేస్తానన్నారు. వేట సమయంలో మత్స్యకారుల మధ్య తలెత్తుతున్న వివాదాల విషయంలో చర్యలు తీసుకోవాలని, మత్స్యకారులకు షెల్టర్ల నిర్మాణంపై కూడా ప్రణాళికలు రూపొందించాలన్నారు. మత్స్యకారులకు బ్యాంకుల నుంచి లభించే రుణాలు, వాటికి సంబంధించిన వివరాలపై నివేదికలు సమర్పించాలన్నారు. 

విజయవాడ, కలిదిండిలో ఉన్న ఆక్వా హబ్స్ మాదిరి జిల్లా కేంద్రాల్లో కూడా హబ్స్ ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయాలన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో మత్స్యకారులను అప్రమత్తం చేయడంతో పాటు వారు క్షేమంగా ఒడ్డుకు చేరుకునేలా వేటకు వెళ్లే పడవలకు శాటిలైట్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మొత్తం 20వేల వేట పడవులు ఉన్నాయని, వాటిలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 4వేల పడవలకు శాటిలైట్ సిస్టమ్‌ను పెడుతున్నామని వెల్లడించారు. దశల వారీగా మిగిలిన పడవలకు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios