విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుని అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి ప్రశంసలతో ముంచెత్తారు. చంద్రబాబు నాయుడు రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు మళ్లీ సీఎం కాకపోతే రాజధాని రైతుల త్యాగం వృథా అవుతుందని అలాగే ఈనెకాసి నక్కలపాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

రాజధాని అమరావతి నిర్మాణం అద్భుతంగా ఉందన్నారు. భవిష్యత్‌ తరాలను దృష్టిలో పెట్టుకునేలా రాజధానిలో నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. వాస్తు ప్రకారం రైతులకు ప్లాట్లు కేటాయించారని, రైతులు చాలా ఆనందంగా ఉన్నారని చెప్పారు. 

హైకోర్టు నిర్మాణం, అధికారుల నివాస గృహాలు నిర్మిస్తున్నారని, రాజధానిలో మౌలిక వసతులు అద్భుతమన్నారు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల రాజధాని కోసం భూములు ఇచ్చామని రైతులు ఆనందంగా చెప్పుకుంటున్నారని తెలిపారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై సబ్బం హరి సెటైర్లు వేశారు. 

రాజధాని కోసం కేంద్రం ఎంత ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్రం సహకరించి ఉంటే పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్రప్రభుత్వం ఖర్చు చేసిన మెుత్తాన్ని ఇవ్వాలని కోరుతుంటే కేంద్రం కొర్రీలు పెడుతోందంటూ వ్యాఖ్యానించారు. 

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పోలవరం ఘనత అంతా చంద్రబాబుకే దక్కుతుందన్నారు. చంద్రబాబు నాయుడు మాత్రమే పోలవరం ప్రాజెక్టును పూర్తి చెయ్యగలరని చెప్పుకొచ్చారు. 

మరోవైపు తెలంగాణలో ఉండి అవమానపడే కన్నా ఏపీకి రావడాన్ని సమర్థిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఏపీకి త్వరగా వచ్చారు కాబట్టే పనులు శరవేగంగా జరుగుతున్నాయని హరి స్పష్టం చేశారు. 

చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడానికి రాజధాని రైతులే రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తామంటున్నారని, ప్రభుత్వం మారితే అంతా అస్థవ్యస్థమవుతుందన్నారు. మళ్లీ చంద్రబాబే సీఎం అవుతారని సబ్బంహరి జోస్యం చెప్పారు.