అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండవిజయం సాధించడంతోపాటు ఈనెల 30న వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేబోతున్నారు. 

ఈనేపథ్యంలో కీలక పోస్టులపై వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఏపీ సీఎస్, డీజీపీ, ఐబీ చీఫ్ లతోపాటు కీలక శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీల నియామకాలపై వైయస్ జగన్ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. 

తాజాగా ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్, అదనపు అడ్వకేట్ జనరల్ పోస్టులపై కూడా కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అంధ్రప్రదేశ్‌ అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ)గా ఎస్‌. శ్రీరామ్‌, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌(ఏఏజీ)గా పొన్నవోలు సుధాకర్‌రెడ్డిలను నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఏజీ, ఏఏజీగా ఎవరిని నియమించాలనే అంశాలపై సీనియర్ న్యాయవాదులు, పలువురు న్యాయవాదుల పేర్లను జగన్ పరిశీలించారు. అయితే జగన్ ఎస్.శ్రీరామ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డిలపై మెగ్గు చూపినట్లు తెలుస్తోంది. వీరి నియామకంపై రాష్ట్రప్రభుత్వం గవర్నర్ కు సిఫారసు చేసే అవకాశం ఉంది. 

రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు మేరకు ఏజీని గవర్నర్ నియమించడం ఆనవాయితీ. ఇకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 

ప్రమాణ స్వీకారం అనంతరం ఏజీ, అదనపు ఏజీల నియామకానికి సంబంధించి మార్గదర్శకాలపై క్లియరెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏజీ.. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు(ఎస్‌జీపీ) ప్రభుత్వ న్యాయవాదులు(జీపీ), సహాయ ప్రభుత్వ న్యాయవాదులు(ఏజీపీ), కార్పొరేషన్లకు స్టాండింగ్‌ కౌన్సిళ్లను సైతం నియమించనున్నట్లు తెలుస్తోంది. వేసవి సెలవుల అనంతరం జూన్‌ 3న హైకోర్టు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో  ఎస్‌జీపీ, జీపీ, ఏజీపీ, స్టాండింగ్‌ కౌన్సిళ్ల నియామక ప్రక్రియ షురూ అయినట్లు తెలుస్తోంది. 

వైయస్ జగన్ తో శ్రీరామ్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి భద్రత విషయంలోనూ, జగన్ ఆస్తుల కేసులోనూ వాదనలు వినిపిస్తున్న న్యాయవాది శ్రీరామ్ కావడం విశేషం.