రష్యా దాడులతో భయానక పరిస్థితులు నెలకొన్న ఉక్రెయిన్ లో చిక్కుకున్న ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులతో పాటు ఉపాధికోసం వెళ్లినవారిని కాపాడి సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని కోరుతూ దేశ విదేశాంగ శాఖ మంత్రిని సీఎం జగన్ కోరారు.
అమరావతి: రష్యా (russia) బాంబులతో విరుచుపడుతుండటంతో ఉక్రెయిన్ (ukraine) దేశంలో భయానక పరిస్ధితులు నెలకొన్నాయి. ఈ రెండు దేశాల మధ్య సంక్షోభం నేపథ్యంలో ఉన్నత విద్య, ఉపాధి కోసం ఉక్రెయిన్ కు వెళ్లిన భారతీయులు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఉక్రెయిన్ తెలుగు విద్యార్థులు, ఉద్యోగులు కూడా భారీగా వున్నారు. దీంతో తెలుగువారిని సురక్షితంగా ఉక్రెయిన్ నుండి స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఇరు తెలుగు రాష్ట్రాలు చర్యలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జయశంకర్ (external affairs minister jayshankar)కు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan) ఫోన్ చేసి మాట్లాడారు.
ఉక్రెయిన్‌లో ఉంటున్న తెలుగువారిని క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేలా కేంద్రం వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం జగన్ కేంద్రమంత్రిని కోరారు. ఈ దిశగా కేంద్రం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి ముఖ్యమంత్రికి వివరించారు. ఉక్రెయిన్ పక్కనున్న దేశాలకు భారతీయులను తరలించి అక్కడ నుంచి ప్రత్యేక విమానాల ద్వారా భారత్‌కు తీసుకు వచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని జయశంకర్ సీఎంకు తెలిపారు.
అయితే తెలుగువారికి ఎలాంటి ముప్పులేకుండా భద్రంగా తీసుకురావాలని సీఎం కేంద్రమంత్రికి విజ్ఞప్తిచేశారు. ఈ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి జయశంకర్ కు సీఎం జగన్ తెలిపారు.
అంతకుముందు ఉక్రెయిన్ లో చిక్కుకున్న ఏపీ విద్యార్ధులు, ఉపాధి కోసం వెళ్లినవారిని ఎలా స్వదేశానికి తీసుకురావాలనే అంశంపై ముఖ్యమంత్రి జగన్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, ఢిల్లీలో ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి అంతర్జాతీయ సహకారంపై ప్రత్యేక అధికారి జితేష్ శర్మలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్రానికిచెందిన తెలుగు విద్యార్థులను ఉక్రెయిన్‌నుంచి క్షేమంగా వెనక్కి తీసుకురావడంపై కేంద్ర విదేశాంగశాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నామని సీఎంకు అధికారులు వివరించారు. ఏపీఎన్‌ఆర్‌టీఎస్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి అయ్యిందన్నారు. జిల్లా కలెక్టర్ల స్థాయిలో కంట్రోల్ రూమ్స్‌ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. విద్యార్థుల వివరాల సేకరణతో పాటు, వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాలన్నారు. కాల్‌సెంటర్లకు ఎలాంటి సమాచారం వచ్చినా వెంటనే దాన్ని విదేశాంగశాఖ అధికారులకు చేరవేసి ఫాలోఅప్ చేయాలని సీఎం జగన్ అధికారులరే సూచించారు.
ఇక ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ ఉక్రెయిన్‌లో ఉన్న ఏపీ వాసులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి ఓ లేఖ కూడా రాసారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న ఏపీ వాసులు తిరిగి రాష్ట్రానికి రావడానికి సహాయం కోరుతున్నారని... రాష్ట్ర ప్రభుత్వం నిత్యం కేంద్ర విదేశాంగ శాఖతో టచ్‌లో ఉందని జగన్ పేర్కొన్నారు. వాళ్లని వెనక్కి తీసుకురావడంలో కావాల్సిన సహకారం కోసం ఢిల్లీలోని ఏపీ భవన్, ఇక్కడి సీఎంవో అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి లేఖలో చెప్పారు. ఉక్రెయిన్‌లోని ఏపీ విద్యార్థులతో ప్రభుత్వం టచ్‌లో ఉందని.. కేంద్రం సూచించిన మేరకు వారంతా వెనక్కి రావడానికి తమ వంతు సహకారం అందిస్తున్నామని సీఎం జగన్ కేంద్ర మంత్రి జయశంకర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
