Asianet News TeluguAsianet News Telugu

జగన్ సిఎం అయితే రోజాకు దక్కే శాఖ అదే...

వైఎస్ జగన్ సీఎం అయితే ఆయన కాబినేట్ లో రోజా హోం శాఖ మంత్రి అయితే సూపర్ అంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో వైఎస్ జగన్ తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం మహిళకు హోంశాఖను కట్టబెట్టి రికార్డు సృష్టించారు. చేవెళ్ల చెల్లెమ్మ అంటూ వైఎస్ఆర్ ఎంతో అప్యాయంగా పిలిచే సబితా ఇంద్రారెడ్డికి హోంశాఖ కేటాయించారు.

Rumours on Roja's position in cabinet, if YCP wins
Author
Amaravathi, First Published Apr 16, 2019, 3:50 PM IST

అమరావతి: ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపు తమదంటే తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ అటు అధికార తెలుగుదేశం పార్టీ చెప్తుంటే, ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనంటూ వైసీపీ చెప్తోంది. 

లక్ కలిసొస్తే తాము కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ జనసేన పార్టీ కూడా చెప్తోంది. అయితే రకరకాల సర్వేలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సర్వేలు ఇస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతల్లో జోష్ నెలకొంది. 

అంతేకాదు వైఎస్ జగన్ సీఎం అయితే ఆయన కేబినేట్ లో ఉండేది ఎవరో అన్న అంశంపై చర్చ కూడా జరుగుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత, వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఫైర్ బ్రాండ్ రోజాకు ఏ మంత్రి పదవి అన్న దానిపైనే ఆసక్తికర చర్చ జరుగుతోందట. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్ తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న ఏకైక నాయకురాలు ఎమ్మెల్యే రోజా. అటు అసెంబ్లీలోనూ ఇటు బయట అధికార తెలుగుదేశం పార్టీని ఓ ఆట ఆడుకుంటూ రాష్ట్ర రాజకీయాల్లో హల్ చల్ చేస్తున్నారు రోజా. 

రాజకీయపరంగానే కాకుండా వైఎస్ జగన్ కుటుంబంతోనూ రోజాకు మంచి సంబంధాలే ఉన్నాయి. వైఎస్ జగన్ ఎమ్మెల్యే రోజాను చెల్లి అంటూ ఆప్యాయంగా పిలుస్తుంటారని టాక్. వైఎస్ షర్మిలలానే రోజా కూడా వైఎస్ కుటుంబంలో ఒక ఆడపడుచుగా చాలా చురుగ్గా ఉంటారని ప్రచారం. 

2014 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనా రోజా తక్కువ కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. ఇంటా బయట అన్నట్లు అసెంబ్లీ, బయట వేదికలపై తెలుగుదేశం పార్టీపై దుమ్మెత్తిపోసేవారు. 

2019 ఎన్నికల్లో కూడా ఆమె నగరి నియోజకవర్గం నుంచే మరోసారి పోటీలో నిలిచారు. ఈసారి కూడా భారీ మెజారిటీతో రోజా గెలుస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అంతేకాదు ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని ప్రచారం జరుగుతుండటంతో రోజాకు ఏ మంత్రి పదవి ఇస్తారా అన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. వైఎస్ జగన్ సీఎం అయితే ఆయన కాబినేట్ లో రోజా హోం శాఖ మంత్రి అయితే సూపర్ అంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో వైఎస్ జగన్ తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం మహిళకు హోంశాఖను కట్టబెట్టి రికార్డు సృష్టించారు. 

చేవెళ్ల చెల్లెమ్మ అంటూ వైఎస్ఆర్ ఎంతో అప్యాయంగా పిలిచే సబితా ఇంద్రారెడ్డికి హోంశాఖ కేటాయించారు. వైఎస్ఆర్ బాటలో పయనించే వైఎస్ జగన్ చెల్లెమ్మ అంటూ పిలచే రోజాకు కూడా హోంశాఖ ఇచ్చే అవకాశం లేకపోలేదంటూ ప్రచారం జరుగుతోంది. 

వైసీపీ రాష్ట్రమహిళా అధ్యక్షురాలిగా రాష్ట్రాన్ని చుట్టేసిన రోజా మహిళలపై తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన దాడులు, హత్యలు, అత్యాచారాలపై తీవ్ర స్థాయిలో గళమెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను హోంశాఖ మంత్రిగా కేటాయిస్తే నేరాలు తగ్గడమే కాకుండా మహిళకు కీలక శాఖ కట్టబెట్టారన్న గుడ్ విల్ వైసీపీకి ఉంటుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

వైఎస్ జగన్ కంటే ధీటుగా అధికార పార్టీని ఇరుకున పెట్టిన రోజాకే హోంశాఖ కేటాయిస్తే మంచిదంటూ తెగ ప్రచారం జరుగుతోంది. ఇంకా ఎన్నికల ఫలితాలు వెలువడ లేదు. తమదే విజయమని అధికార తెలుగుదేశం పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. మరో నెలరోజులు ఎన్నికల ఫలితాలకు సమయం ఉండగా మంత్రి పదవులపై జోరుగా చర్చలు జరగడం గమనార్హం.
 

Follow Us:
Download App:
  • android
  • ios