ఆస్తి కోసం ఏకంగా తండ్రినే చంపాలని చూసిన మాజీ ఆర్మీ జవాన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా పీలేరులో ఈ దారుణం జరిగింది. తండ్రి స్కూటీని కారుతో ఢీకొట్టి యాక్సిడెంట్‌గా చిత్రీకరించాలని చూసినప్పటికీ.. సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు కుట్రను ఛేదించారు.  

ఆస్తి కోసం కన్నతండ్రినే చంపాలని చూశాడో దుర్మార్గుడు. స్కూటీ మీద వెళ్తున్న తండ్రిని వెనుక నుంచి కారుతో ఢీకొట్టడంతో బాధితుడు తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లిపోయాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కొడుకే తండ్రిని చంపేందుకు ప్రయత్నించాడని నిర్ధారించి అరెస్ట్ చేశారు. నిందితుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి రిటైర్డ్ ఆర్మీ జవాన్‌గా పోలీసులు తెలిపారు. 

అన్నమయ్య జిల్లా (Annamayya district ) పీలేరుకు (pileru) చెందిన చంద్రశేఖర్ రెడ్డికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు ఇద్దరు కొడుకులు, చిన్న భార్యకు పిల్లలు లేరు. అయితే ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు చనిపోవడంతో ఆస్తి కావాలంటూ చిన్న కొడుకు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి పట్టుబట్టాడు. దీంతో సగం ఆస్తిని కొడుక్కి రాసిచ్చాడు. ఆ తర్వాత రెండో భార్య తమ్ముడి దగ్గరే వుంటున్నాడు. 

దీంతో మిగిలిన సగం ఆస్తిని అతనికి రాసిస్తాడేమోనన్న అనుమానంతో తండ్రిని చంపేందుకు ప్రయత్నించాడు. దీనిలో భాగంగా స్కూటీ మీద వెళ్తున్న తండ్రిని కారుతో ఢీకొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ప్రమాదంపై అనుమానం రావడంతో చంద్రశేఖర్ రెడ్డి బావమరిది ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తులో కొడుకు లక్ష్మీ ప్రసాద్ రెడ్డే తండ్రిని చంపేందుకు ప్రయత్నించాడని తేల్చారు.