Asianet News TeluguAsianet News Telugu

అనంతపురం జిల్లా డోనెకల్ వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. బళ్లారి వెళ్తుండగా ఘటన

అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి కురిసిన వర్షానికి భారీగా  వరద నీరు వచ్చి చేరడంతో జిల్లాలోని పలు వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి.

rtc bus stuck in flood water in anantapur district
Author
First Published Sep 5, 2022, 11:26 AM IST

అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి కురిసిన వర్షానికి భారీగా  వరద నీరు వచ్చి చేరడంతో జిల్లాలోని పలు వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. విడపనకల్లు మండలం డోనెకల్ వాగు పొంగిపోర్లుతుంది. ఈ క్రమంలోనే గుత్తి నుంచి బళ్లారి వెళ్తున్న ఆర్టీసీ బస్సు డోనెకల్ వాగులో  చిక్కుపోయింది. ఆ సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్.. బస్సులోని ప్రయాణికులకు క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం స్థానికులు ట్రాక్టర్ సాయంతో బస్సును బయటకు తీసుకొచ్చారు. ప్రమాదం నుంచి బయటపడంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 

ఇదిలా ఉంటే అనంతపురం జిల్లాలో ఇటీవల కురిసిన  భారీ వర్షాలు కురిసిన సమయంలో.. స్థానికులు వేగంగా స్పందించడంతో ఓ మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగింది. ఎల్లనూరు మండలం సింగవరం వద్ద రోడ్డుపై  మహిళ నడుచుకుంటూ వెళ్తుంది. ఈ రోడ్డు పక్కనే నది ప్రవహిస్తుంది.  భారీ వరద కారణంగా రోడ్డు కుంగిపోయింది.  మహిళ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలోనే  రోడ్డు కుంగిపోవడంతో ఆమె  రోడ్డుపైనే కూలబడిపోయింది.  అక్కడే ఉన్న స్థానికులు తక్షణమే స్పందించి ఆ మహిళకు చేయి అందించి ఆమెను కాపాడారు. మరికొన్ని క్షణాలు మహిళ ఆ కుంగిపోయిన రోడ్డుపై ఉంటే వరద నీటిలో కొట్టుకుపోయే అవకాశం ఉండేదని స్థానికులు చెబుతున్నారు.  సకాలంలో స్పందించిన స్థానికులకు మహిళ ధన్యవాదాలు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios