40 మంది విద్యార్థులతో వెళుతుండగా... బస్సు చక్రాలు అమాంతం విరిగిపడటంతో....
స్కూల్ విద్యార్థులతో వెళుతున్న ఆర్టిసి బస్సు ప్రమాదానికి గురయిన ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నుండి విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

నంద్యాల : దసరా సెలవులు ముగిసాయి. చాలారోజుల తర్వాత స్కూల్ కు వెళుతున్న విద్యార్థులు పెనుప్రమాదం నుండి బయటపడ్డారు. నలబైమందికి పైగా విద్యార్థులతో వెళుతున్న ఆర్టిసి బస్సు ప్రమాదానికి గురయిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులోని ఆదర్శ పాఠశాలలో చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు చదువుకుంటున్నారు. దసరా సెలవుల నేపథ్యంలో చాలారోజులు ఇళ్లవద్దే వున్న విద్యార్థులు బుధవారం తిరిగి స్కూల్ కు పయనంఅయ్యారు. ఇలా ఉదయమే పలు గ్రామాలకు చెందిన 40మంది విద్యార్థులతో ఆర్టిసి బస్సు బయలుదేరింది.
అయితే విద్యార్థులను తీసుకువెళుతున్న బస్సు మార్గమధ్యలో ప్రమాదానికి గురయ్యింది. ఒక్కసారిగా బస్సు ముందుచక్రాల కమాన్ కట్టలు విరిగిపోయాయి. దీంతో బస్సు ముందుభాగం రోడ్డుకు తాకి ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ సమయంలో బస్సు నెమ్మదిగానే వెళుతుండటంతో పెనుప్రమాదం తప్పింది. కొందరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.
Read More నా లవర్ మోసం చేసింది.. బస్సులో ప్రేమికుడి వీరంగం, ఐలవ్ యూ అంటూ జనాలమీదికి మట్టి చల్లుతూ హంగామా..
బస్ యాక్సిడెంట్ పై సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రలు ఆందోళనకు గురయ్యారు. తమ బిడ్డల కోసం ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడ్డ విద్యార్థులకు హాస్పిటల్ కు తరలించారు. ఆర్టిసి అధికారుల నిర్లక్ష్యం, రోడ్ల అద్వాన పరిస్థితి వల్లే ప్రమాదం జరిగిందని విద్యార్థుల పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. కాలంచెల్లిన బస్సులను గుంతలమయమైన రోడ్లపై తిప్పడంవల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఎవరికీ ఏం కాలేదు కాబట్టి సరిపోయింది... జరగకూడనిది జరిగితే బాధ్యులెవరని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.