అమరావతి: ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అన్న చందంగా తయారైంది ఏపీలోని రాజకీయ పరిస్థితులు. ఇంకా ఎన్నికల రిజల్ట్స్ కు నెల సమయం దాటి ఉన్న ఎవరు లెక్కలు మాత్రం వారు వేసేసుకుంటున్నారు. 

అటు టీడీపీ అధినేత చంద్రబాబు 130 సీట్లతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తుంటే వైఎస్ జగన్ సైతం తామే అధికారంలోకి వస్తామని 130 సీట్లు పక్కా అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సర్వేలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేస్తోంది. 

ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయి ఏ శాఖ కేటాయిస్తారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ వైసీపీ ఎమ్మెల్యే రోజాపై అయితే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతోంది. 

నిన్నటి వరకు రోజాకు హోంశాఖ కేటాయిస్తారని ఒకరు, స్త్రీ శిశుసంక్షేమశాఖ అంటూ మరోకరు కాదు కాదు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అంటూ ఇంకొకరు ఇలా రకరకాల పదవులను కేటాయిస్తూ తెగ ప్రచారం చేస్తున్నారు. తాజాగా మరో ప్రచారం మెుదలైంది. 

బుల్లితెరపై మంచి పాపులర్ షో అంటే ఠక్కున చెప్పేది జబర్దస్త్ అని. ఆ షో నటీనటులకు ఎంత పేరుతెచ్చిపెట్టిందో న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజాకు అంతే పేరు తెచ్చిపెట్టింది. ఒక్కరోజు జడ్జిలుగా నాగబాబు, రోజా మిస్ అయితే పెద్ద చర్చే జరుగుతోంది. ఎందుకంటే వాళ్లిద్దరూ లేని జబర్దస్త్ షో చూడలేం కాబట్టి. 

కమెడీయన్లు చేసే కామెడీకి రోజా, నాగబాబు నవ్వే నవ్వులకు ప్రేక్షకులు అలవాటు పడిపోయారు. ఎందుకు రోజా జబర్దస్త్ షో నుంచి ఫెడ్ అవుట్ అవుతున్నారో కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. మే 23న వచ్చే ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే గెలుపు అని ఫలితం వస్తుందని వైసీపీ ధీమాగా ఉంది. 

వైఎస్ జగన్ సీఎం అయితే జగన్ కేబినేట్ లో రోజా ఉండబోతున్నారని ఆమె కీలక మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారని ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్ షోకి జడ్జిగా రోజా వచ్చారు. 

అయితే రోజా అధికార పార్టీపై విమర్శలు చేసేటప్పుడు ఎమ్మెల్యేగా పనికిరారు జబర్దస్త్ షోలు చేసుకో అంటూ పలువురు ఘాటుగా విమర్శించిన సందర్భాలు లేకపోలేదు. అయినా రోజా మాత్రం వాటి మాటలను పట్టించుకోలేదు. 

కానీ మంత్రిగా బాధ్యతలు చేపడితే ఆమె షోకి వెళ్తే తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఫలితంగా ఆమెపైనే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆమె జడ్జిగా కొనసాగే అవకాశం లేదని తెలుస్తోంది. అంతేకాదు మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి మరో వృత్తి చెయ్యకూడదన్న నిబంధన ఉండటంతో ఆమె జబర్దస్త్ కు వీడ్కోలు పలకనున్నారని ప్రచారం హోరెత్తిస్తోంది. 

ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు రోజులు దగ్గరకొచ్చే కొద్దీ రోజాపై రకరకాల రూమర్స్ ప్రచారం జరుగుతున్నాయి. మెున్నటి వరకు నగరిలో రోజా మెజారిటీపై చర్చ జరిగింది. అదికాస్త ముగిసింది అనుకునేసరికి వైఎస్ జగన్ సీఎం అయితే ఆయన కేబినేట్ లో రోజాకు మంత్రి పదవి ఖాయమని మరో చర్చ మెుదలైంది. 

అది కూడా అక్కడితో ఆగిపోలేదు. ఆ శాఖ ఈ శాఖ అంటూ రకరకాల ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా ఏకంగా ఆమె అత్యంత ఇష్టపడే జబర్దస్త్ షో నుంచి అవుట్ అంటూ సరికొత్తగా ప్రచారం జరుగుతోంది. ఇక్కడితో అయినా రోజాపై గాసిప్స్ ఫుల్ స్టాప్ పడతాయో లేక ఇంకెలాంటి ప్రచారం జరుగుతుందో వేచి చూడాలి.