అమరావతి: నవయుగ సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు, బందరుపోర్టు విషయంలో కోలుకోలేని షాక్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం తాజాగా కృష్ణపట్నం పోర్టు భూముల విషయంపై కోలుకోలేని దెబ్బతీసింది. 

కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. కృష్ణపట్నం ఇన్‌ఫ్రా సెజ్‌ కోసం కేటాయించిన భూముల్ని రద్దు చేసింది. ఈ భూముల్లో ఎలాంటి పరిశ్రమలు పెట్టకపోవడంతో భూముల కేటాయింపు నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్లు ఏపీఐఐసీ తెలిపింది.  

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టుకు కేవలం 6 కిలోమీటర్ల దూరంలోనే ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తామంటూ 2009-10లో నవయుగ సంస్థ 4వేల 731 ఎకరాల భూమిని తీసుకుంది. పదేళ్లు దాటినా ఒక్క పని కూడా మొదలుపెట్టలేదు.  

పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటూ ఎకరం కేవలం రూ.1.15 లక్షలకే ఈ భూమిని ఏపీఐఐసీ విక్రయించింది. అనంతరం ఆ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి భారీగా రుణాలు తీసుకుంది. ఐసీఐసీఐ నుంచి రూ.400కోట్లు, సెంట్రల్ బ్యాంకు నుంచి రూ.250 కోట్లు, అలహాబాద్ బ్యాంకు నుంచి రూ.200 కోట్లు రుణం తీసుకుంది. మరికొన్ని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంది.
 
ఏపీఐఐసీ భూముల నుంచి రుణాలు తీసుకోవాలంటే అందుకు అనుమతి తప్పనిసరి. కానీ కృష్ణా ఇన్ ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలాంటి అనుమతులు లేకుండా బ్యాంకుల నుంచి నగదు తీసుకున్నట్లు ఆరోపణలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి.   

పరిశ్రమల ఏర్పాటు అంటూ ప్రభుత్వం నుంచి తక్కువ ధరకే భూములు తీసుకున్న నవయుగ సంస్థ ఆ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ఏకంగా రూ.1900 రూపాయలు రుణం పొందింది. అలాగే ఏపీఐఐసీ అనుమతులు కూడా తీసుకోకుండా నిబంధనలు ఉల్లంఘించింది.  

ఏపీఐఐసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎమ్మెల్యే రోజా ఈ ఆరోపణలపై ఆరా తీశారు. ఏపీఐఐసీ ఎన్‌వోసీ లేకుండానే నవయుగ సంస్థ బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకుందని నిర్ధారించడంతో నవయుగకు కేటాయించిన భూ కేటాయింపుల రద్దు చేశారు. 

సెజ్‌ అభివృద్ధి కోసం కాకుండా ఈ భూమని సొంత అవసరాలకు వినియోగించుకున్నారని ఆరోపిస్తూ ఏపీఐఐసీ నోటీసులు జారీ చేసింది. అయితే ఏపీఐఐసీ నోటీసులకు సదరు సంస్థ ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో భూముల కేటాయింపును రద్దు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 

భూ కేటాయింపుల సమయంలో చేసుకున్న నిబంధనలు అమలు చేయకపోవటం ప్రభుత్వం నుండి నోటీసులు ఇచ్చినా స్పందించకపోవటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటు న్నట్లుగా స్పష్టం చేసింది.