నగరి: చిత్తూరు జిల్లా నగరి ప్రోటోకాల్ వివాదం కొత్త మలుపు తీసుకుంది. తనకు చెప్పకుండా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, సత్యవేడు ఎమ్మెల్యే కె. ఆదిమూలం అంబేడ్కర్ ట్రస్ట్ భవన నిర్మాణానికి ఎంపికైన స్థలాన్ని పరీశీలించడం వివాదానికి దారి తీసింది. తన నియోజకవర్గంలో తనకు చెప్పకుండా వారు పర్యటించడాన్ని నగరి ఎమ్మెల్యే రోజా తీవ్రంగా పరిగణించారు. 

ఎస్సీ, ఎస్టీల కోసం కల్యాణ మండపం, కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం పుత్తూరులో స్థల పరిశీలనకు మంగళవారంనాడు నారాయణస్వామి, ఆదిమూలం పర్యటించారు. ఆ సంఘటనపై రోజా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో అంబేడ్కర్ ట్రస్టు సభ్యులు తమ వైఖరి మార్చుకున్నారు. 

అంబేడ్కర్ ట్రస్టు సభ్యులు రోజాను కలిశారు. ట్రస్ట్ భవనాల నిర్మాణానికి సహకరించాలని వారు రోజాను కోరారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీలకు ఇళ్ల స్థలాలు కూడా వచ్చేలా చూడాలని కోరారు. తనకు చెప్పకుండా నారాయణస్వామి, ఆదిమూలం తన నియోజకవర్గంలో పర్యటించడంపై రోజా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె అసంతృప్తిని నారాయణస్వామి తేలిగ్గా కొట్టేసే ప్రయత్నం చేశారు. డిప్యూటీ సీఎంగా ఎక్కడైనా పర్యటించే హక్కు తనకు ఉంటుందని ఆయన అన్నారు.

Also Read: నారాయణస్వామి వర్సెస్ రోజా: నగరిలో డిప్యూటీ సీఎం టూర్, ఫైర్ బ్రాండ్ ఫైర్

నారాయణ స్వామి పర్యటన సమయంలో రోజా నగరిలోని తన నివాసంలోనే ఉన్నారు. ఆయినా ఆమెను పిలువలేదు. దీంతో రోజా తీవ్రంగా స్పందించారు. ఏం తప్పు చేశానని తనను పిలువ లేదని ఆమె ప్రశ్నించారు. వారిని వెళ్లకూడదని తాను చెప్పడం లేదని, ఎస్సీల కోసం కల్యాణ మండపం నిర్మించడం తనకు కూడా సంతోషదాయకమేనని, తనను కూడా పిలిస్తే గౌరవంగా భావించేదాన్నని ఆమె అన్నారు.

ఎమ్మెల్యేలను పిలువాల్సిన అవసరం లేదని జగన్ ను చెప్పమనండి అని ఆమె అన్నారు. ప్రోటోకాల్ లేదు, నా ఇష్టం అంటే సరిపోతుందా అని రోజా మండిపడ్డారు. రోజా అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అక్కడకు వెళ్లడానికి తనకు రోజా అనుమతి అవసరం లేదని, కలెక్టర్ పుత్తూరు మీదుగా తిరుపతి వెళ్తుంటే తీసుకుని వెళ్లి స్థలాలు చూపించామని, దానితో రోజాకు ఏమీ సంబంధమని నారాయణ స్వామి అన్నారు. ఈ వ్యవహారంపై రోజా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో మొత్తం వ్యవహారం రివర్స్ అయింది.