Asianet News TeluguAsianet News Telugu

అనంతపురంలో టీడీపీకి షాక్: వైసీపీలోకి కీలక నేతలు

ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఓ ఉన్మాది అని, తమపై కక్ష సాధించేందుకు రొద్దం మండల అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఎంపీపీ పద్మావతి ఆరోపించారు. 2017 నుంచి తాను ఎంపీపీగా కొనసాగుతున్నానని అయితే తమ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక ఎమ్మెల్యే పార్థసారధి కక్ష సాధింపు చర్యలతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. 

roddam mpp padmavathi to quit to tdp
Author
Ananthapuram, First Published Feb 5, 2019, 2:52 PM IST

అనంతపురం: అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారధి వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రొద్దం మండల ఎంపీపీ రాజీనామా చేశారు. ఆమెతోపాటు పలువురు టీడీపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. 

ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఓ ఉన్మాది అని, తమపై కక్ష సాధించేందుకు రొద్దం మండల అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఎంపీపీ పద్మావతి ఆరోపించారు. 2017 నుంచి తాను ఎంపీపీగా కొనసాగుతున్నానని అయితే తమ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక ఎమ్మెల్యే పార్థసారధి కక్ష సాధింపు చర్యలతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. 

పేరుకు మాత్రం తాము ఎంపీపీ హోదాలో ఉన్నా ఆశించిన స్థాయిలో ప్రజలకు సేవ చెయ్యలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కరుడుగట్టిన ఉన్మాదిలా మారిన ఎమ్మెల్యే అన్ని అంశాలలోనూ అడ్డు తగులుతున్నారని చెప్పారు. 

మండల అభివృద్ధి సంక్షేమ పథకాలను అడ్డుకోవడంతోపాటు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు సైతం ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే లేఖ ఉంటేనే నిధులు ఇస్తున్నారని విమర్శించారు. 

అధికార టీడీపీ కన్నా గత కాంగ్రెస్‌ హయామే మేలన్నారు. తమను ఎంపీ నిమ్మలకిష్టప్ప చేరదీయడాన్ని జీర్ణించుకోలేక మరింత వేధింపులకు గురి చేస్తూ వచ్చారని ఎంపీపీ పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. 

తమకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చడంతో ఆ పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తాము ఎంతో కష్టపడ్డామని, పార్థసారథి వెన్నంటే ఉంటూ వచ్చామని వివరించారు. తమ అనుచరులతో కలిసి వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios