కలియగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతూ ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. బైక్ పై కొండపైకి వెళుతున్న ఓ వ్యక్తిని ఘాట్ రోడ్డుపై ఓ జీపు ఢీకొట్టింది. దీంతో బైకర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. 

ఈ ప్రమాదం తిరుమల మొదటి ఘాట్ రోడ్డుపై జరిగింది. బలరాం అనే భక్తుడు దైవ దర్శనం కోసం బైక్ పై తిరుమల కొండపైకి బయలుదేరాడు. ఇలా ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్న అతడు 34వ మలుపు వద్దకు రాగానే ఓ ప్రయాణికుల జీపు వెనుకవైపునుండి వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో బైక్ అమాంతం ఎగిరి రోడ్డు పక్కన రక్షణ కోసం నిర్మించిన పిట్టగోడను బలంగా ఢీకొంది. దీంతో బలరాం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.  

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుందని పోలీసులు తెలిపారు.