విశాఖపట్నం: నిన్న విశాఖ షిప్‌యార్డులో జరిగిన క్రేన్ ప్రమాదంలో 11 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఇందులో భాస్కర రావు అనే వ్యక్తి కూడా ఉన్నారు. ఇప్పటికే ఆయన మృతితో విషాదంలో వున్న కుటుంబంలో మరో ఘోరం జరిగింది. భాస్కరరావు మృతదేహాన్ని చూసేందుకు వస్తూ ఆయన కుటుంబీకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలవగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌తో పాటూ ఇద్దరు బంధువులు చనిపోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. 

శ్రీకాకుళం జిల్లా కంచిలిలో జలంతర కోట హైవేపై ఆగి ఉన్న లారీని బంధువులు ప్రయాణిస్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది. 

అసలేం జరిగిందంటే... 

తమ అల్లుడు క్రేన్ ప్రమాదంలో చనిపోయాడని తెలియగానే బెంగాల్ లోని ఖరగ్‌పూర్‌కి చెందిన 48 ఏళ్ల నాగమణి, ఆమె కొడుకులు రాజశేఖర్, ఈశ్వరరావు, ఇద్దరు కోడళ్లులావణ్య, పెతిలి విశాఖకు కారులో బయలుదేరారు. అయితే వారు ప్రయాణిస్తున్న కారు శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. రోడ్డుపక్కన ఆగివున్న లారీని కారు ఢీకొట్టడంతో నాగమణి, లావణ్య, 23 ఏళ్ల డ్రైవర్‌ రౌతుద్వారక స్పాట్‌లోనే చనిపోయారు. ః

ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన వారిని సోంపేట గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాజశేఖర్‌, పెతిలికి కొద్దిగా గాయాలు అవ్వగా... ఈశ్వరరావు పరిస్థితి విషమంగా ఉంది. సోంపేట ఆసుపత్రిలో డాక్టర్లు ఫస్ట్ ఎయిడ్ చేసి శ్రీకాకుళం రిమ్స్‌కి తీసుకెళ్లమని చెప్పారు. ఈ విషాద ఘటనను పోలీసులు పరిశీలిస్తున్నారు.