అర్ధరాత్రి విశాఖపట్నం జిల్లా సింహాచలం నుండి శ్రీకాకుళం జిల్లా కంచిలికి వెళుతున్న ఇన్నోవా కారు రోడ్డుప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు.
శ్రీకాకుళం: అర్ధరాత్రి కారు అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లి చెట్టును బలంగా ఢీకొట్టిన దుర్ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ రోడ్డుప్రమాదంలో కారులోని ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ జిల్లాలోని సింహాచలం నుండి శ్రీకాకుళం జిల్లాలోని కంచిలోకి ఓ ఎనిమిదిమంది ఇన్నోవా కారులో బయలుదేరారు. వీరు 16వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా పలాసపురం వద్ద కారు అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది.
శనివారం అర్ధరాత్రి డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి రోడ్డుపై నుండి కిందకు దూసుకెళ్ళి ఓ చెట్టును ఢీకొట్టి ఆగింది. దీంతో కారులోని ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు కారులోంచి క్షతగాత్రులను బయటకు తీసి దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. గాయపడినవారికి చికిత్స అందించిన డాక్టర్లు ఎవరికీ ప్రాణనష్టం లేదని తెలిపారు. దీంతో క్షతగాత్రుల కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ రోడ్డుప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. అలాగే హాస్పిటల్ లో చికిత్స పోందుతున్న క్షతగాత్రుల నుండి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ రోడ్డుప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
