ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని సంఘమిత్ర హాస్పిటల్ సమీపంలో జాతీయ రహదారి అదుపుతప్పిన మ్యాక్సీ కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మిగతావారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 

వివరాల్లోకి వెళితే...తిరుపతి వెంకన్న సన్నిదిలో జరిగిన వివాహ వేడుకను జరుపుకున్న ఓ పెళ్లి బృందం స్వస్థలం తెనాలికి బయలుదేరారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున వారు ప్రయాణిస్తున్న వాహనం ఒంగోలులో రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుకనుండి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో కారు అమాంతం ఎగిరి ముందు వెళుతున్న లారీని వెనుక నుండి ఢీకొట్టింది. దీంతో వాహనం నుజ్జునుజ్జయ్యింది. 

ప్రమాద సమయంలో కారులో డ్రైవర్ తో సహా 10 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో ఇద్దరు ప్రమాద స్థలంలోనే మృతిచెందగా మిగతావారు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. 

ఈ యాక్సిడెంట్ కు కారణమైన రెండు లారీలను అక్కడే వదిలిపెట్టి డ్రైవర్లు పరారయ్యారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేనుకుని గాయపడ్డ వారిని హాస్పిటల్ కు తరలించారు. ఆ తర్వాత మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. మృతులు సత్యనారాయణ, అన్నపూర్ణగా గుర్తించారు. ఈ ప్రమాదంలో 10సంవత్సరాల బాలిక కూడా తీవ్రంగా గాయపడింది.