ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో కూడిన బొలేరో వాహనాన్ని ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో ఇతర రాష్ట్రానికి చెందిన ఐదుగురు ప్రయాణికులు మృత్యువాతపడ్డారు.

తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఐదుగురు వ్యక్తులు చిత్తూరు జిల్లాకు ఓ బొలెరో వాహనంలో వచ్చారు. జిల్లాలోని బైరేడ్ పల్లి మండలం విరూపాక్షపురంలో పక్షపాతం నయమవడానికి లభించే మందులు తీసుకుని తమ స్వస్థలానికి తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం శాంతిపురం మండలం కడపల్లి వద్దకు రాగానే ఘోర ప్రమాదానికి గురయ్యింది. ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో వాహనం నుజ్జునుజ్జయ్యింది. వాహనంలోని ప్రయాణికులంతా మృత్యువాతపడ్డారు.

ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వాహనం నుండి బైటికి తీసి పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.