విజయనగరం: విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. విహారయాత్రకని వెళ్తే కానరాని లోకాలకు పంపించేశాడు తాగుబోతు డ్రైవర్. కుమార్తె పుట్టినరోజున దైవదర్శనం చేసుకుని తిరుగుప్రయాణం అవుతున్న ఆ కుటుంబంలో మారణ హోమం సృష్టించాడు డ్రైవర్. ఐదుగురిని బలితీసుకున్నాడు.

ఈ విషాద ఘటన ఛత్తీస్ గఢ్ జిల్లాలోని జగదల్ పూర్ లో చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా మిమ్స్ వైద్యకళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డా. సునీత తన కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా విహారయాత్రకు జదల్ పూర్ వెళ్లారు. 

విశాఖపట్నం నుంచి తన కుటుంబంతోపాటు బంధువులను కూడా విహారయాత్రకు తీసుకువెళ్లారు. విశాఖపట్నం నుంచి విశాఖ-కిరండూల్ రైలులో జగదల్ పూర్ వెళ్లారు. అక్కడ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించేందుకు ఓ కారును బుక్ చేసుకున్నారు. 

ఆ కారులు వెళ్లి చిత్రకోట జలాశయాన్ని సందర్శించిన వారు ఎంతో ఆహ్లాదకరంగా గడిపారు. అనంతరం అక్కడ నుంచి దంతెవాడలోని దంతేశ్వరి ఆలయానికి వెళ్లారు. దంతేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

అనంతరం తిరుగు ప్రయాణంలో కారులో బయలుదేరారు. జగదల్ పూర్ రైల్వేస్టేషన్ కు చేరుకునే సమయంలో మద్యంమత్తులో ఉన్న డ్రైవర్ ఓ చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయిపోయింది. ఈ ప్రమాదంలో సునీత భర్త లక్ష్మణరావు, కుమార్తె శ్రేయ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

మిగిలిన వారిని జగదల్ పూర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రమేష్, తిరుమల రావులు మృతి చెందారు. మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని విశాఖపట్నం తరలిస్తుండగా మధ్యలో డా.సునీత మరణించారు. 

మెుత్తం ఈ ప్రమాదంలో డా.సునీత కుటుంబానికి చెందిన నలుగురులో ముగ్గురు దుర్మరణం చెందారు. ఇకపోతే సోదరుడు రమేష్, బంధువు తిరుమల రావు కూడా మృత్యువాత పడ్డారు. మెుత్తం ఐదుగురు మృతిచెందగా తిరుమలరావుకు చెందిన ఒక మహిళతోపాటు స్కార్పియో డ్రైవర్ పవన్ నెట్టం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.  

ఇకపోతే విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మారడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. డా.సునీత కుటుంబంలో కుమారుడు మాత్రమే మిగిలారు. మిగిలిన వారంతా విగతజీవులుగా మారడంతో వారు కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అందర్నీ కంటతడిపెట్టిస్తోంది. 

డా.సునీత మిమ్స్‌ ఆస్పత్రిలో అనాటమీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. వైద్యకళాశాలలో సునీతకు మంచి పేరు ఉంది. ప్రమాదంలో సునీత మృతిచెందడంతో మిమ్స్‌ సిబ్బందితో పాటు యాజమాన్యం శోకసంద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.