అమరావతి: ప్రస్తుతం కరోనావైరస్, మిడతల దండు దాడితో దేశాలని ప్రమాదం పొంచివుండగా... కేంద్రంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీకి మరో ప్రమాదం పొంచివుందని వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారాన్ని కొల్పోయిన టిడిపి మిడతల దండు బిజెపి వైపు కదులుతోందని... ఇప్పటికే బిజెపిలో చేరిన ఆ దండు విధ్వంసాన్ని ప్రారంభించదని అన్నారు. ఈ ప్రమాదం నుండి బిజెపి ఎలా బయటపడుతుందో చూడాలని విజయసాయి రెడ్డి అన్నారు. 
 
''ఏడాది కాలంగా తినడానికి ఏమీ దొరక్క నక నక లాడుతున్న టీడీపీ మిడతల దండు కమలం పువ్వు వైపు కదులుతోంది. ఇప్పటికే కొన్ని మిడతలు ఆపార్టీలో చేరి విధ్వంసం సృష్టిస్తున్న విషయం గ్రహించేలోగానే మిగతావి ఎగురుకుంటూ బయల్దేరాయి. ఈ విపత్తు నుంచి బిజెపి ఎలా బయటపడుతుందో చూడాలి''  అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.

''స్వార్థం కోసం జెండాలు మార్చేవారంతా లిటిగేటర్ల అవతారం ఎత్తుతున్నారు. ప్రజాతీర్పును అపహాస్యం చేయాలని చూస్తే ఏ వ్యవస్థా ఉపేక్షించదు. పతనమైన విలువలకు ప్రాణం పోసే యత్నం చేస్తున్న జగన్ గారిని ఈ శక్తులేవీ అడ్డుకోలేవు. మీడియా ఎంటర్ టెయినర్లుగా మిగలడం మినహా సాధించేది ఏముండదు'' అని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. 

''ఎన్నికలకు ముందు జగన్ గారు అసలు అధికారంలోకి రానే రారన్నాడు ఓ పబ్లిక్ పార్క్ ఆక్రమించుకున్న ఓ విశాఖ గల్లీ నాయకుడు. పచ్చ మీడియాలో డిబేట్లతో ఊదరగొట్టి ఇప్పుడు పూర్తికాలం అధికారంలో ఉండరంటున్నాడు. ఈ CBN తొత్తుల ప్రీపెయిడ్ సిమ్స్ కి రీఛార్జ్ చేయడం ఆపేస్తే నోళ్లు మూగబోతాయి'' అంటూ విజయసాయి ట్వీట్టర్ వేదికన విరుచుకుపడ్డారు.