తెలుగుదేశంపార్టీ వాదన ఎప్పుడూ కిందపడ్డా పై చేయి మాదే అన్నట్లుంది. తాజాగా వైసిపి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విషయంలో కూడా రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ అడ్డుగోలు వాదన వినిపించారు. ఇంతకీ ఏం జరిగిందంటే, కేంద్రప్రభుత్వంపై వైసిపి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. వైసిపి ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు చంద్రబాబునాయుడు ప్రకటించారు.

అంత వరకూ బాగానే ఉంది. అయితే, గురువారం రాత్రి మద్దతు ప్రకటించిన చంద్రబాబు శుక్రవారం తెల్లారే సరికి అడ్డం తిరిగారు. వైసిపికి మద్దతు ఇచ్చేది లేదన్నారు. తాము కూడా కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. సరే, తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలిసిందే.

పార్లమెంటు వాయిదా పడిన తర్వాత అదే విషయాన్ని మీడియా టిడిపి ఎంపి సిఎం రమేష్ మాట్లాడారు. వైసిపికి మద్దతు ఇస్తానని ప్రకటించి తర్వాత ఉపసంహరించుకున్న విషయాన్ని మీడియా ప్రస్తావించింది. దానికి రమేష్ బదులిస్తూ, కేంద్రానికి వ్యతిరేకంగా వైసిపి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతానని ప్రకటించినా చివరి నిముషంలో డ్రామాలాడే అవకాశం ఉందని టిడిపికి సమాచారం ఉందట.

అలాగే, వైసిపికి ఆ అవకాశం ఇవ్వకూడదనే టిడిపి మద్దతు ఉపసంహరించుకోవటమే కాకుండా తామే సొంతంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. దాంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారట.

అసలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు బహిరంగంగా ప్రకటించిందే జగన్మోహన్ రెడ్డి. నోటీసు ఇవ్వటానికి తేదీకూడా ప్రకటించారు. అదే సమయంలో టిడిపి నోటీసు ఇచ్చినా తాము మద్దతిస్తానని కూడా ప్రకటించారు. ఇంత చేసిన జగన్ పై టిడిపికి అనుమానమట. అందుకే ముందుజాగ్రత్తగా తాము కూడా నోటీసు ఇచ్చినట్లు రమేష్ చెప్పటం విచిత్రంగా ఉంది.