హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సీఎస్, సిఈవోలపై సీఎం చంద్రబాబు పలు ఆరోపణలు చేశారు. 

ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు గవర్నర్ నరసింహన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. తమ మనోభవాలు దెబ్బతీసేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని ఇలాంటివి భవిష్యత్ లో జరగకుండా జోక్యం చేసుకోవాలంటూ గవర్నర్ నరసింహన్ ను కోరారు. 

ఇటీవలే సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కోవర్టు అంటూ కామెంట్ చేశారు. అంతేకాదు ఆయనపై కేసులు ఉన్నాయంటూ ఆరోపించారు. అటు సిఈవో గోపాలకృష్ణపై కూడా చంద్రబాబు దురుసుగా ప్రవర్తించారంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, మాజీ చీఫ్ సెక్రటరీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తూ వారంతా చంద్రబాబుకు లేఖ సైతం రాశారు. బహిరంగ క్షమాపణలు కోరారు. తాజాగా 34 మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల బృందం గవర్నర్ నరసింహన్ ను కలిసి చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు 
చంద్రబాబు వ్యాఖ్యలను గవర్నర్ కు తెలిపి తమ నిరసన తెలియజేసినట్లు తెలిపారు. 

సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదని వారంతా మండిపడ్డారు. ఐఏఎస్ ల మనోభవాలను దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడారని వారంతా ఆరోపించారు. అలాగే ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని చంద్రబాబు బెదిరించడం దారుణమని వాపోయారు. 

భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గవర్నర్ ను కోరినట్లు తెలిపారు. గవర్నర్ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వారు తెలిపారు. సీఎస్, సిఈవోలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంపై కేసును హై కోర్టు కొట్టివేసిందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు స్పష్టం చేశారు. 

మెజారిటీ అధికారులు నిజాయితీగా ఉన్నారు కాబట్టే వ్యవస్థ ఇంకా సక్రమంగా నడుస్తోందన్నారు. సీఎస్, సిఈవోల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా చంద్రబాబు వ్యవహరించారని ఆరోపించారు. వ్యవస్థను మళ్లీ రీఫిల్ చెయ్యాల్సిన అవసరం ఉందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు డిమాండ్ చేశారు.