హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 7.82 కోట్ల మంది ఆధార్ డేటా, ఓటర్ ఐడీ సహా వ్యక్తిగత వివరాలు ఐటీ గ్రిడ్స్ వద్ద ఉన్నట్టు తెలంగాణ పోలీసులు గుర్తించడంపై రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఈఏఎస్ శర్మ కేంద్ర  ఐటీ శాఖకు లేఖ రాశారు.  

ఐటీ గ్రిడ్స్‌పై  అభియోగాలను ఐటీ మంత్రిత్వశాఖతో పాటు యూఐడీఏఐ, ఈసీ తీవ్రంగా  పరిగణించాల్సిన అవసరం ఉందని  ఆయన ఆ లేఖలో అభిప్రాయపడ్డారు. ఇది ముమ్మాటికి పౌరుల వ్యక్తిగత గోప్యత ఉల్లంఘన కిందకే వస్తోందని ఆయన  అభిప్రాయపడ్డారు.  యూఐడీఏఐ, ఈసీలు తెలుగు ప్రజలకు సంతృప్తికర వివరణ ఇవ్వాలని ఆయన కోరారు.

యూఐడీఏఐ చైర్మన్‌ జే సత్యనారాయణ, ఏపీలో టీడీపీ ప్రభుత్వ ఈ గవర్నెన్స్‌, ఐటీకి సీనియర్‌ సలహాదారుగా వ్యవహరిస్తుండటంపై గతంలో తాను రాసిన లేఖను సమాచార సాంకేతిక శాఖ విస్మరించిందని శర్మ ఆరోపించారు.

ప్రైవేట్‌ కంపెనీతో కుమ్మక్కై ఈ తతంగంలో పాలుపంచుకున్న యూఐడీఏఐ అధికారులందరిపై చర్యలు చేపట్టాలని కోరారు. ఈ వ్యవహారంలో రాజకీయ పార్టీ ప్రమేయం ఉందని తేలితే ఆయా బాధ్యులపైనా కేసు నమోదు చేయాలన్నారు. ఐటీగ్రిడ్స్‌ వ్యవహారంలో సరైన చర్యలు చేపట్టడంలో ఐటీ మంత్రిత్వ శాఖ విఫలమైతే తాము న్యాయస్ధానాలను ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు.