ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 6వ తేదీన ఐదు చోట్ల రీపోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గురువారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన 6వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రీపోలింగ్ జరుగుతుందని వెల్లడించారు.

గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని కేసనపల్లిలోని  94వ నెంబర్ పోలింగ్ బూత్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నల్లచెరువులోని  244వ పోలింగ్ బూత్, నెల్లూరు జిల్లా కోవ్వూరు నియోజకవర్గంలోని పల్లెపాలెంలోని ఇసుకపల్లి 41వ నెంబర్ పోలింగ్ బూత్, సూళ్లూరుపేట నియోజకవర్గం అటకానితిప్ప 197వ పోలింగ్ బూత్, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని కలనూత 247 రీపోలింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు.

రీపోలింగ్ బూత్‌లను సైతం సమస్యాత్మకంగానే పరిగణిస్తామని ద్వివేది స్పష్టం చేశారు. అదనపు ఈవీఎంలు, వీవీప్యాట్‌‌లు సిద్ధంగా ఉంచుతామని సీఈవో తెలిపారు. బెల్ కంపెనీ ఇంజనీర్లు సిద్ధంగా ఉంటారని.. సీసీ కెమెరాల ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తామన్నారు.

ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని ద్వివేది అధికారులను ఆదేశించారు. ఏప్రిల్  11న జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈవీఎంలు మొరాయించడంతో పాటు పలు చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడం, ఘర్షణలు చోటు  చేసుకోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.

ఈ క్రమంలో పోలింగ్ బూత్‌ స్ధాయిల్లో పరిస్ధితులను పరిశీలించి అధికారుల నివేదిక మేరకు ఈ ఐదు చోట్ల రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.