వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకట రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపల్లే నియోజకవర్గ ఇంచార్జీగా తన స్థానంలో ఈపూరు గణేశ్‌ను నియమించడంపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. తాజాగా, ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తాను జగన్‌ను వదులుకోనని స్పష్టం చేశారు. 

అమరావతి: వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకట రమణ ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రేపల్లే నియోజకవర్గం వైసీపీ ఇంచార్జీగా మోపిదేవి వెంకట రమణను తప్పించి ఆయన స్థానంలో కొత్తగా ఈపూరు గణేశ్‌ను నియమించడాన్ని నిరసించారు. రాజకీయాల్లో తనకు ఇష్టంలేని వ్యక్తులతో కొనసాగాల్సి వస్తున్నదని కామెంట్ చేశారు. తాను మనసు చంపుకుని పని చేస్తున్నానని వివరించారు. చెరుకుపల్లిలో ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీతో ఆయనకు దూరం పెరుగుతుందని, జగన్‌నూ విడిచి వెళ్లిపోతాడనే ప్రచారం మొదలైంది. తన వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంతో తాజాగా మరోసారి మోపిదేవి స్పందించారు.

తాను జగన్‌ను వదులుకోనని స్పష్టం చేశారు. ఎందుకంటే ఆయన తనకు, తను ప్రాతినిధ్యం వహిస్తున్న సామాజిక వర్గానికి గౌరవాన్ని ఇచ్చారని వివరించారు. తాను ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ తనను ఎమ్మెల్సీగా చేసి క్యాబినెట్‌లోకి తీసుకున్నారని మోపిదేవి తెలిపారు. అనంతరం, శాసన మండలి రద్దు అనే చర్చ రాగానే తనను రాజ్యసభకు పంపారని వివరించారు.

Also Read: జగన్ టికెట్ ఇవ్వకపోయినా డోంట్ వర్రీ .. నగరి సీటును ఎవరికిచ్చినా ఓకే : సిట్టింగ్‌ల మార్పుపై రోజా కీలక వ్యాఖ్యలు

అందుకే జగన్‌ను వదులుకోనని మోపిదేవి వివరించారు. జగన్ చెప్పిన మాటే తనకు వేదం అని, తాను ఆయన నిర్ణయాలను గౌరవిస్తానని తెలిపారు. ఎన్నికల్లో ఓడినప్పటికీ జగన్ తనకు ఇచ్చిన గౌరవం తనతోపాటు కార్యకర్తలకు, తన సామాజిక వర్గానికి కూడా చెందుతుందని అన్నారు. మరోమారు రేపల్లె నియోజకవర్గ ఇంచార్జ్‌ను మార్చడంపై మాట్లాడారు.

రేపల్లే నియోజకవర్గానికి ఇంచార్జీగా ఈపూరు గణేశ్‌ను నియమించారని, అయితే, ఈ నిర్ణయంతో పార్టీ వర్కర్లు, తన సామాజిక వర్గ పెద్దల్లోనూ కొంత స్తబ్దత ఏర్పడిందని మోపిదేవి వెంకటరమణ వివరించారు. అయితే, అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థి ఈపూరు గణేశ్‌ను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.