ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు త్వరలో ఒక కొత్త రూపాన్ని సంతరించుకోనున్నాయనేది నేటి పవన్ కళ్యాణ్ మాటలను బట్టి మనకు స్పష్టమవుతుంది. పవన్ ఎం మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ బీజేపీనేతలకన్నా ఎక్కువగా మతం అనే కార్డును ఎత్తుకొని ముందుకెళుతున్నారు. 

జగన్ నివాసానికి కూతవేటు దూరంలో కృష్ణా పుష్కర ఘాట్ వద్ద సామూహిక మత మార్పిడి జరిగితే ప్రభుత్వానికి కనిపించలేదా అని పవన్ ప్రశ్నించారు. ఎవరి అండతో మత మార్పిడులు జరుగుతున్నాయని.. హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన దేవాదాయ శాఖ కానీ, ప్రజాప్రతినిధులు కానీ దీనిపై స్పందించలేదని పవన్ విమర్శించారు.

హిందూ ధర్మానికి దెబ్బ తగులుతుంటే మిగిలిన పార్టీలు సైతం స్పందించడం లేదని.. మిగిలిన మతాల ఓట్లు పోతాయనే వారు మాట్లాడటం లేదని జనసేనాని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం ఒకవేళ మత మార్పిడులపై స్పందించకుంటే ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళ్తుందని పవన్ తెలిపారు.

ఇందుకు సంబంధించి కొద్దిసేపటి కింద జనసేన శతాగ్ని టీం ఒక వీడియోను ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది. దీన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక రేంజ్ లో షేర్ చేస్తున్నారు. పుష్కరాల కోసం అభివృద్ధి చేసిన పున్నమి ఘాట్ లో మతమార్పిడులు జరుగుతున్నా ప్రభుత్వానికి కనపడడం లేదా అని ఈ వీడియో కింద పోస్టును జత చేసారు.