ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ షాకిచ్చింది. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ గతంలో చేసుకున్న 2 ఒప్పందాల్లో ఒకదాని నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది.

చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో రూ.15 వేల కోట్లతో ఏర్పాటు చేయదలచుకున్న ఎలక్ట్రానిక్, పరికరాలు ఉత్పత్తి పరిశ్రమ ఆలోచనను రిలయన్స్ విరమించుకున్నట్లు ఏపీ పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. ఈ యూనిట్‌కు అప్పటి ప్రభుత్వం భూములను కేటాయించగా కొంతమేరకు కోర్టు కేసుల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

అప్పటి ప్రభుత్వం ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి యూనిట్ కోసం రిలయన్స్‌కు 150 ఎకరాలు కేటాయించింది. వైఎస్ జగన్ సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రభుత్వం 75 ఎకరాలు అప్పగించింది. అయితే 15 మంది రైతులు వివిధ కారణాలతో కేసులు దాఖలు చేయడంతో 50 ఎకరాల భూమి వివాదంలో చిక్కుకుంది.

Also Read:జగన్‌కు షాక్: రివర్స్ టెండరింగ్‌పై పీపీఏను నివేదిక కోరిన కేంద్రం

కాగా... ఆంధ్రప్రదేశ్‌లో రూ.52 వేల కోట్లతో 2 పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం, రిలయన్స్ సంస్థల మధ్య రెండు అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. వాటిలో తిరుపతి సమీపంలో ఎలక్ట్రానిక్ పరికరాల పరిశ్రమ ఒకటి కాగా.. మరొకటి కాకినాడ సమీపంలో చమురు, సహజ వాయువు నిక్షేపాలు వెలికితీసే ప్రాజెక్ట్ రెండోది.

మొదటి దాని నుంచి వెనక్కి తగ్గిన రిలయన్స్.. చమురు నిక్షేపాలు వెలికి తీసేందుకు మాత్రం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. భారత పెట్రోలియం కార్పోరేషన్ భాగస్వామ్యంతో రిలయన్స్ చమురు, సహజవాయువులను వెలికి తీయనుంది.

అయితే రేణిగుంట మండలం ఏర్పేడుకు చెందిన 12 మంది వ్యవసాయదారులకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం నచ్చకపోవడంతో భూములు ఇచ్చేందుకు ససేమిరా అనడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Also read:జగన్‌కు షాక్: అమరావతి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న వరల్డ్‌బ్యాంక్

దీనిపై సీఐటీయూ మండల నేత షేక్ కరీముల్లా మాట్లాడుతూ.. ప్రభుత్వానికి భూములు ఇవ్వని రైతులపై పోలీసులు బెదిరింపులకు పాల్పడటంతో పాటు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం నష్టపరిహారాన్ని ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించింది. ఏ కేటగిరీ కింద 3 లక్షలు, బీ కేటగిరీ కింద 7 లక్షలు, సీ కేటగిరీ కింద 15 లక్షలు నష్టపరిహారాన్ని రైతులకు అందిస్తామని అధికారులు తెలిపారు.

మరోవైపు రిలయన్స్ సంస్థ ఒప్పందం నుంచి తప్పుకోవడంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. టీడీపీ హయాంలో పరిశ్రమల ఏర్పాటుకు అనేక ఒప్పందాలు జరిగాయని.. వీటిలో చాలా సంస్థలు ముందుకు రావడం లేదన్నారు.

ప్రస్తుతం రిలయన్స్ పరిస్ధితీ అలాగే ఉందన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి యూనిట్ నుంచి వైదొలగడం వెనుక కొన్ని ప్రత్యేక కారణాలున్నాయని గౌతమ్ రెడ్డి వెల్లడించారు. తాము రిలయన్స్ ప్రతినిధులతో చర్చిస్తున్నామని.. అయినప్పటికీ వారు ముందుకు రావడం లేదని మంత్రి పేర్కొన్నారు.