అమర్నాథ్ కోడిగుడ్డు, పవన్ మూడు పెళ్లిళ్లే వైఎస్ జగన్ కొంపముంచాయి...
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఓటమికి అనేక కారణాలు వున్నాయి. వైఎస్ జగన్ తో పాటు ఆయన మంత్రివర్గ సభ్యుల మాటలు, చేష్టలు కూడా ఓటమికి ఓ కారణం. ఎలాగంటే....
అమరావతి : ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎన్నికలు రాజకీయ పార్టీలకు ఓ కేస్ స్టడీ లాంటివి. ప్రజా సంక్షేమం ఒక్కటే పార్టీలను గెలిపించలేదని... అభివృద్ది, సుపరిపాలన కూడా తమకు అవసరమని ఈ ఎన్నికల ద్వారా ప్రజలు తెలియజేసారు. అధికారం చేతిలో వుందికదా అని అతిచేస్తే చూస్తూ ఊరుకోబోమని ప్రజలు హెచ్చరించినట్లుగా ఫలితాలు వచ్చాయి. ప్రజాగ్రహానికి గురయితే అందలం ఎక్కినవారు కూడా అధ:పాతాలానికి పడిపోవడం ఖాయమన్నద నిరూపించిన ఎన్నికలివి. మొత్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓవర్ కాన్ఫిడెంట్ తో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి చతికిలపడగా... టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రజాశీర్వాదంతో బంపర్ మెజారిటీతో విజయం సాధించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసిపి ఈ ఎన్నికల్లో ఘోరంగా 11 సీట్లకే పరిమితం అయ్యింది. ఇదే సమయంలో గత పరాభవం నుండి పాఠాలు నేర్చుకుని ఒంటరిగా కాకుండా జనసేన, బిజెపితో జతకట్టి బరిలో దిగిన టిడిపి ఏకంగా 164 సీట్లు సాధించింది.
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు వైసిపి ఓటమికి అనేక కారణాలున్నాయి. గతంలో మరే ప్రభుత్వం అందిచనన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామని వైఎస్ జగన్, వైసిపి నాయకులు చెబుతున్నారు. అలాంటిది తమ పార్టీని ప్రజలెందుకు ఓడగొట్టారు..? టిడిపి కూటమికి అంతటి భారీ విజయాన్ని ఎందుకు అందించారు..? అన్నది వారికి అంతుచిక్కడం లేదు. అయితే ప్రజల్లో వైసిపిపై ఎందుకంత వ్యతిరేకత ఏర్పడిందో క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకున్నారు ఓ జర్నలిస్ట్. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు వైసిపికి ఎందుకు దూరమయ్యారో తెలియజేస్తూ ఆయన సోషల్ మీడియాలో ఓ స్టోరీ రాసుకొచ్చారు.
జర్నలిస్ట్ ఎమ్ఎన్ఆర్ సోషల్ మీడియా స్టోరీ యధావిధిగా :
జగన్ ను ఎందుకు ఘోరంగా ఓడించారు. ప్రజలు చెప్పిన జవాబులు ఆసక్తికరం.
నోట్ - ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండో రోజే నేను ఉత్తరాంధ్ర వెళ్లాను. వ్యక్తిగత పనులతో పాటుగా ప్రజలు ఎందుకు ఈ స్థాయి తీర్పునిచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేశాను. నా రాతలు పాత ప్రభుత్వ లోపాలనే కాదు... కొత్త ప్రభుత్వానికి సూచనలుగానూ ఉండొచ్చు.
బాబూ నా టీ కొట్టుకి మా అమ్మ పేరు పెట్టుకున్నాను. కానీ... నాకు పెబుత్వం డబ్బులు ఇచ్చిందని... జగన్ పొటోతే మా నమ్మకం నీవే జగనూ అనే బోర్డు పెట్టారు బావూ. మా యమ్మ పేరున్న బోర్డు తీసేశారు. ఎవుడబ్బ డబ్బులిచ్చాడు ఈడు(జగన్). మా డబ్బులే మాకిచ్చి... మా యమ్మ పేరుని తీస్సేరు. అప్పుడే అనుకున్నా ఈసారి ఈడికి ఓటెయ్యకూడదని. అందుకే సైకిల్ కి గుద్దేశా. ఇది సీతానగరం నుంచి పాత బొబ్బిలి వస్తున్నప్పుడు రోడ్డు పక్కన ఓ టీ కొట్టు వ్యక్తి చెప్పిన మాట.
కురుపాం నియోజకవర్గంలో కొందరు ఏమన్నారంటే....రెండోసారి గెలిసాక పుష్పమ్మకి బాగా గర్వం వచ్చిందయ్యా... అగుపడ్డమే(కనిపించడం) మానేసింది. ఇంతకు మునుపులాగా ఆమె మాటల్లేవు అంటూ గొల్లుమంది ఓ మహిళా ఓటరు. సీ..సీ.సీ...(చీచీచీ) కురుపాంలో వైసీపీ జెండా పట్టుకోవడమే పాపం అయిపోందండీ. ఆవిడ గారేమో కోట్లు సంపాదించేసింది. మాకు సిన్నా, సితకా కర్సులకు కూడా డబ్బులు లేవంటదీ. పార్టీ నుంచి ఎంతొచ్చిందో మాకు తెల్దా (తెలియదా). అందుకే ఈసారి ఎలచ్చన్ లో మేము పల్లకుండిపొన్నాం. (కామ్ గా ఉన్నాం) ఇది కరడు గట్టిన ఓ వైసీపీ కార్యకర్త మాట. ఈ పాలి (సారి) మా అమ్మికే టిక్కెట్టు ఇచ్చినారు... అందుకే ఈపాలి మా ఓటు ఇటేసేసినాం. ఇదో సమాధానం. మా అమ్మి అంటే వారి కులస్థులు అని అర్ధం. చంద్రబాబు నాయుడు జాతాపు కమ్యూనిటీ మహిళకు కురుపాంలో టికెట్ కేటాయించారు.
పార్వతీపురం నియోజకవర్గం. అంటే మా ఊరు. మా నియోజకవర్గంలో ఆసక్తికర అంశాలు తెలిశాయి. మా ఎమ్మెల్యే దోపిడీ మామూలుగా లేదు. దొంగైపోనాడండీ. ఆయనకి ఖాలీ జాగా(ప్లేస్) కనపడిదంటే సాలు... అయిపోయినట్టే... అతగాడి ఎవ్వారం అలా ఉంటే... ఆయన సుట్టూ తిరిగే వారున్నారు సూడండీ... వారి ఎక్స్ ట్రాలు మామూలుగుండవు. అందుకే ఈసారి గుద్దిపడేశాం. ఏపారాలు లేవండీ... ఎవుడిదగ్గర పైసా లేదు. డబ్బులిస్తే సరిపోద్దా... అయినా ఎవుడి సొమ్మది మనదే కదా... ఆయన ఇంట్లో నుంచి ఇచ్చాడా... ఇదో వ్యాపారి సమాధానం. బావూ(బాబూ) పాపం ఆయన సెల్లి... సర్మిలమ్మ తిరిగితేన కదా... ఈయనగోరు(జగన్) ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయన జైల్లో ఉన్నప్పుడు ఆవిడ తిరిగిందా... నేదా(లేదా)... రాత్రుల్లో కూడా కీసు గొంతేసుకుని ఎన్నెన్ని ఊర్లు తిరిగింది... అలాంటి సెల్లినే ఎల్లగొడ్డేశాడు బావు. ఇది తప్పుకదేటి. అందుకే... నాకు అమ్మ ఒడి వచ్చినా.. జగన్ కు ఓటు ఎయ్యనే ( వెయ్యలేదు). ఇది ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు అందుకున్న ఓ మహిళ మనోగతం.
బొబ్బిలి నియోజకవర్గం...రామభద్రపురంలో ఓ తాత చెప్పిన మాటలు... బాబూ అందరూ దొంగలే. ఎవడొచ్చినా నా పని నాదే. నీ పని నీదే. కానీ... దర్మం.. నేయం ఉంటాయి కదా...
పవన్ కల్యాణ్ కి ఎంతమంది పెల్లాలుంటే జగన్ కు ఎందుకు సెప్పు... ఆయన పెళ్లాంకి లేని అడ్డు... మనకెందుకు... హా...నువ్వు సెప్పు... అడుగుతున్నావ్ కదా... నేను ఏటి సేశాను... ఏటి సేస్తాను... ఇది సెప్పాలి... అంతేగానీ...సీసీసీ... ఇంత దుర్మార్గమా... అందుకే నాస్ట్ సారి( లాస్ట్ టైం) జగన్ కే ఏసాను ఓటు. ఈసారి మనసు ఇరిగిపే. పవన్ కల్యాన్ కే గుద్దేద్దాం అనుకున్నాను.. కానీ మా దగ్గర ఈలు ముగ్గురు జట్టు కట్టారు కదా... అదేటది... హా... కూటమి.. దానికి నొక్కేశాను... అంటూ... తన ఆవుల్ని తోలుకుంటూ వెళ్లిపోయాడు.
ఈసారి పోస్ట్ రిజల్ట్ అభిప్రాయ సేకరణ భలే అనిపించింది. అనకాపల్లిలో కొంతమంది జగన్ కు ముఖ్యంగా ఈసారి అనకాపల్లి నుంచి వైసీపీ నుంచి పోటీ చేసిన అమర్ ప్రవర్తనను నేరుగా అసహ్యించుకున్నారు. ఈ ఏడేం మంత్రండీ... కోడి గుడ్డు మంత్రి.... సేసిందేటీ నేదు. ఏ గుడ్డూ సేయలేదు... ఏమంటే కోడి గుడ్డు కథ సెప్పాడు... అంటూ నవ్వారు.
విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలో ఓ పెద్దాయన చెప్పిన విషయం బహుశా విశాఖ ప్రాంత అభిప్రాయంగా కనిపించింది. సూడండీ బాబు... మీరు జర్నలిస్టు అంటున్నారు. మీకు తెలియందీ ఏదీ లేదు. మేం ప్రశాంతంగా ఉండాలి అనుకుంటాం. రిటైర్డ్ అయ్యాక మేం కోరుకునేది హాయిగా ఉండే నగరాన్ని. కానీ... గత మూడేళ్లుగా ఏమైందో తెలీదు కానీ...
మునుపు ఉన్న ప్రశాంతత విశాఖ కోల్పోయిందేమో అనిపించింది అండీ... నాకు జగన్ కంటే... ఆయన తండ్రంటే ఇష్టం. అందుకే గత ఎన్నికల్లో జగన్ కే ఓటు వేశాను. కానీ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డికి.. జగన్ కు అస్సలు పోలికే లేదండీ. అందుకే ఈసారి నేను జగన్ కు ఓటు వెయ్యలేదంటూ... పార్కు బెంచీ నుంచి లేచి వెళ్లిపోయారు.
నేరుగా నేను తెలుసుకున్న చాలా అంశాల్లో కొన్నింటినే ఇక్కడ ప్రస్తావించాను. పక్కా గ్రౌండ్ రిపోర్ట్ బై....