టిడిపి నేతలకు ఏడాది పొదవునా పండగకాక మరేమిటి?

తెలుగుదేశం నేతలకు మాత్రం నిజంగా పండగే పండగ. మనకు ఏడాది పొడవునా ఏదో పండగ వస్తూనే ఉంటుంది. ఆయా పండగలను బట్టి ముఖ్యమంత్రి ఉచిత సరుకుల పంపిణీ చేస్తున్నారు.

ప్రతీ పండగకు కోట్ల రూపాయల్లో సరుకులు కొనటం పంపిణీ చేయటం. అత్యవసరం పేరిట కొనుగోలు చేయాల్సి నిత్యావసరాలను నామినేషన్ పద్దతిలో కొనేయటం. ఆ కొనుగోలు కూడా మళ్లీ టిడిపి నేతలకు సంబంధించిన వారి నుండే కొంటున్నారని ఆరోపణలు రావటం. మరి టిడిపి నేతలకు ఏడాది పొదవునా పండగకాక మరేమిటి?

 ఇదంతా ఎందుకంటే మరో ‘ఉచితా’నికి చంద్రబాబునాయడు తెరతీసారు. ఈ నెలాఖరులో రానున్న క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్తియన్ సోదరులకు చంద్రబాబు పేరుతో మొదలైన ‘చంద్రన్న కానుక’ రూపంలో ప్రజాధనాన్ని పప్పు బెల్లాల్లాగ పంచనున్నారు.

పండగ సందర్భంగా 1.34 కోట్ల రేషన్ కార్దులకు ఉచితంగా నిత్యావసరాలను పంపిణీ చేయటానికి రంగం సిద్ధమైంది.

పండుగ సందర్భంగా ఇవ్వనున్న సరుకుల్లో 1 కేజి గోధుమపిండి, అరలీటర్ పామాయిల్, అర్ధకేజి బెల్లం, కందిపప్పు అర్ధకేజి, శెనగపప్పు అర్ధకేజి, 100 గ్రాముల నెయ్యి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తానికి రూ. 460 కోట్లు వ్యయం అవనున్నది.

గతంలో వివిధ సందర్భాల్లో పంపిణీ చేసిన ఉచిత సరుకుల పంపిణీలో అనేక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఉచితమనేటప్పటికి ఏదో రూపంలో మొత్తం కాంట్రాక్ట్ ను పార్టీ నేతలకే కట్టబెడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా పంపిణీ చేసిన సరుకులు కూడా చాలా నాసిరకంగా ఉన్నాయని కృష్ణా జిల్లా కలెక్టర్ ఆ మధ్య నిర్ధారించారు కూడా.

దాంతో అప్పటి వరకూ పంపిణీ చేసిన సరుకులు మొత్తాన్ని వాపలు తీసుకుని మళ్ళీ పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించటం గమనార్హం. ఈసారి పంపిణీ చేయబోయే సరుకుల్లో ఎంత నాణ్యత ఉంటుందో చూడాలి.

ఎందుకంటే, సరుకుల నాణ్యత విషయంలో ఇప్పటికే ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను సూచించింది. నాణ్యత లేని సరుకులను వాపసు చేయాల్సిందిగా ప్రభుత్వం అన్నీ జిల్లాలకు ఆదేశాలు కూడా జారీ చేయటం గమనార్హం. ప్రజాధనంతో జనాలకు ఉచితాలేమిటో తెలియటం లేదుగాని కొందరు పార్టీ నేతలకు మాత్రం నిజంగా పండగే.