రాజోలు... గత  ఐదేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిచిన ఏకైక సీటు రాజోలు. జనసేన అధినేత సైతం పోటీచేసిన రెండుస్థానాల్లో ఓడిపోయినా రాజోలులో మాత్రం జనసేనను గెలిపించి సత్తాచాటారు రాపాక వరప్రసాద్. అయితే గెలిచిన ఒక్క ఎమ్మెల్యేను కూడా కాపాడుకోలేకపోయింది జనసేన... రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాపాక వైసిపిలో చేరారు. ఇలా గత ఐదేళ్లుగా రాజోలులో ఆసక్తికర రాజకీయాలు చోటుచేసుకోవడంతో ఈసారి అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారింది. పొత్తులో భాగంగా రాజోలులో మళ్లీ జనసేన పోటీ చేస్తుండటంతో ఉత్కంఠ నెలకొంది. 

రాజోలు రాజకీయాలు : 

ఆంధ్ర ప్రదేశ్ లోని ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో రాజోలు ఒకటి. ఇక్కడినుండి రాపాక వరప్రసాద్ 2009 లో కాంగ్రెస్, 2019లో జనసేన తరపున పోటీచేసి గెలిచారు. అయితే ఇప్పుడు ఆయన వైసిపిలో కొనసాగుతున్నారు. అయితే ఈసారి మళ్లీ రాజోలు నుండి పోటీ చేయాలని రాపాక భావిస్తున్నా వైసిపి అధిష్టానం మాత్రం ఆయనను పార్లమెంట్ బరిలో నిలపాలని చూస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా వరప్రసాద్ తెలిపారు. తనను అమలాపురం ఎంపీగా పోటీ చేయమని వైసిపి అధినేత వైఎస్ జగన్ కోరారని రాపాక వెల్లడించారు. కాబట్టి ఈసారి రాజోలు పోటీనుండి రాపాక తప్పుకున్నట్లే. ఈసారి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు రాజోలు బరిలో నిలిచారు.

ఇక టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థిగా దేవ వరప్రసాద్ బరిలోకి దిగేలా వున్నారు. రాజోలు సీటు తిరిగి జనసేనకే దక్కింది... ఇప్పటికే పవన్ అభ్యర్థిని కూడా నిర్ణయించారు. వైసిపి హవా కొనసాగిన సమయంలోనే రాజోలును జనసేన గెలుచుకుంది... కాబట్టి ఈసారి కూడా రాజోలు తమదేనన్న ధీమాతో జనసైనికులు వున్నారు. 

రాజోలు నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. మలికిపురం
2. రాజోలు
3. సఖినేటిపల్లి 
4. మామిడికుదురు (కొంత భాగం) 

రాజోలు అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) ‌- 2,10,996

పురుషులు - 1,05,258

మహిళలు ‌- 1,05,737

రాజోలు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

జనసేన నుండి గెలిచి వైసిపిలో చేరిన రాపాక వరప్రసాద్ రాజోలు బరినుండి తప్పుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్న ఆయనను కాదని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు వైసిపి అవకాశం ఇచ్చింది. ఇలా రాజోలు నియోజకవర్గంలో వైసిపి ప్రయోగం చేస్తోంది. 

జనసేన అభ్యర్థి :

రాజోలు సీటును జనసేన పార్టీ సీరియస్ గా తీసుకుంది. పట్టుబట్టిమరీ మిత్రపక్షాల నుండి ఈ సీటును దక్కించుకున్న జనసేన దేవ వరప్రసాద్ ను బరిలోకి దింపింది.

రాజోలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

రాజోలు అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,45,641 

జనసేన పార్టీ - రాపాక వరప్రసాద రావు - 50,053 (32.92 శాతం) - 814 ఓట్ల మెజారిటీతో విజయం

వైసిపి - బొంతు రాజేశ్వరరావు - 49,239 (32.91 శాతం) - ఓటమి 

టిడిపి - గొల్లపల్లి సూర్యారావు ‌- 44,592 (30 శాతం)

రాజోలు అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,35,230 (77 శాతం)

టిడిపి - గొల్లపల్లి సూర్యారావు - 66,960 (49 శాతం) ‌- 4,683 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - బొంతు రాజేశ్వరరావు - 62,277 (46 శాతం) - ఓటమి