ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు... జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఊహించని షాక్ ఇచ్చారు. జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రావెల కిశోర్ బాబు ప్రకటించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కి లేఖ కూడా రాశారు.

గతంలో టీడీపీ నేతగా ఉన్న రావెల కిశోర్ బాబు... మంత్రిగా కూడా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ఏపీ ఎన్నికల సమయంలో  టీడీపీని వీడి... జనసేన చెంతన చేరారు. పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ తో ఎన్నికల్లో గెలవొచ్చనే భావనతో ఆయన జనసేనలో చేరారు. కానీ ఎన్నికల్లో ఆ పార్టీ ని ప్రజలు అసలు పట్టించుకోనేలేదు. రావెల ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.  కనీసం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కే విజయం దక్కలేదు. ఈ క్రమంలో కొందరు నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఈ జాబితాలో రావెల కూడా చేరిపోయారు.

అయితే... తనకున్న కొన్ని వ్యక్తిగత కారణాల కారణంతో పార్టీని వీడుతున్నట్లు రావెల చెప్పడం గమనార్హం. మరి ఈ ఘటనపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.