అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. మాజీమంత్రి రావెల కిషోర్ బాబు టీడీపీకి గుడ్ బై చెప్పారు. గత కొంతకాలంగా పార్టీలో అసంతృప్తితో ఉన్న రావెల కిషోర్ బాబు శుక్రవారం ఉదయం శాసనసభ సభ్యత్వానికి  రాజీనామా చేశారు. శాసనసభ కార్యాలయంలో రావెల కిషోర్ బాబుతోపాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది రాజీనామా లేఖ సమర్పించారు. 

సాయంత్రం టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో అందజేసినట్లు తెలుస్తోంది. 

ఇకపోతే రావెల కిషోర్ బాబు జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. గత కొంతకాలంగా టీడీపీలో అసంతృప్తిగా ఉన్న ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే జగన్ నుంచి రావెల చేరికపై ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన జనసేనలో చేరబోతున్నారు. 

శనివారం విజయవాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. నాగార్జున యూనివర్శిటీ నుంచి అభిమానులతో ర్యాలీగా జనసేన పార్టీ కార్యాలయం చేరుకుని అక్కడ పవన్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజధాని అమరావతి పరిసర ప్రాంతాల నియోజకవర్గాల్లో టీడీపీ పాగా వెయ్యాలని చంద్రబాబు నాయుడు వ్యూహాలు రచిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో అన్ని నియోజకవర్గాలను టీడీపీ కైవసం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రణాళిక రచిస్తున్నారు. ఇలాంటి తరుణంలో రావెల కిషోర్ బాబు పార్టీ వీడటం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బే అని చెప్పుకోవాలి.