ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటి రేషన్  పథకానికి సంబంధించి అడ్డంకులు ఎదురవుతూనే వున్నాయి. ఇంటి వద్దకు నిత్యావసరాలు పంపిణీ చేయలేమంటూ వాహనాల ఆపరేటర్లు తప్పుకుంటున్నారు. తాజాగా అనంతపురం జిల్లా గుంతకల్లులో 20 మంది వాహన ఆపరేటర్లలో 10 మంది తమ వాహనాలను తహసీల్దారు కార్యాలయంలో అప్పగించారు.

తమకు ప్రభుత్వం ఇస్తున్న రూ.21 వేలు.. పెట్రోల్‌, వాహన ఈఎంఐ, హమాలీకే సరిపోతోందని ఆపరేటర్లు వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీ కూడా అందడం లేదని వారు చెబుతున్నారు. తమకొచ్చే జీతంలో ఏమీ మిగలట్లేదని.. వెట్టి చాకిరి చేయడం తప్ప ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అందుకే వాహనాలను తిరిగి ఇచ్చేశామని ఆపరేటర్లు స్పష్టం చేస్తున్నారు. వాహనం తీసుకునే సమయంలో తాము రూ.70 వేల వరకు ఖర్చు పెట్టామని.. దాన్ని ఇచ్చేస్తే వేరే ఉపాధి చూసుకుంటామని చెబుతున్నారు.   

మరోవైపు ఇంటింటికి రేషన్ ఇచ్చే సమయంలో విజయవాడలో ముగ్గురు రేషన్ డీలర్లు చనిపోయారు. దీంతో ఎండీయూలతో పనిచేయించలేక డిపోల్లోనే పంపిణీ చేయాలని డీలర్లకు అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో అధికారులు తీరుతో రేషన్ డిపోలు కరోనా కేంద్రాలుగా మారతాయని డీలర్లు భయపడుతున్నారు. దీంతో వారు డెలివరీకి అంగీకరించడం లేదని ఆయన తెలిపారు.