రాప్తాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live

2024 ఎన్నికల విషయానికి వస్తే.. రాప్తాడుపై పట్టును కోల్పోకూడదని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. దీనిలో భాగంగా గత ఎన్నికల్లో పరిటాల కుటుంబానికి చెక్ పెట్టిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికే మరోసారి టికెట్ కేటాయించారు.

Raptadu Assembly Election Counting and Results 2024 Live dtr

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం పేరు చెప్పగానే దివంగత నేత పరిటాల రవి పేరే గుర్తొస్తోంది. ఆయన కుటుంబానికి గట్టి పట్టున్న ప్రాంతాల్లో రాప్తాడు ఒకటి. అనంతపురం జిల్లా మొత్తాన్ని రవి శాసించినా.. ధర్మవరం, పెనుగొండ, రాప్తాడు నియోజకవర్గాల్లో పరిటాల ప్రాబల్యం ఎక్కువ. ఆంధ్రప్రదేశ్‌లోని హాట్ సీట్లలో రాప్తాడు ఒకటి. సీజన్‌తో సంబంధం లేకుండా ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్‌గానే వుంటాయి. 

రాప్తాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. పరిటాల కుటుంబానికి కంచుకోట :

2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా రాప్తాడు ఏర్పడింది. ఆత్మకూరు, అనంతపురం రూరల్, రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రాప్తాడు మండలాలు ఈ సెగ్మెంట్ పరిధిలోకి వస్తాయి. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం ఉమ్మడి అనంతపురం జిల్లాను విభజించడంతో రాప్తాడు పరిస్ధితి విచిత్రంగా మారింది. రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి మండలాలు సత్యసాయి జిల్లాలో.. అనంతపురం రూరల్, రాప్తాడు, ఆత్మకూరు మండలాలు అనంతపురం జిల్లా పరిధిలోకి వస్తాయి. 

రాప్తాడులో మొత్తం ఓటర్ల సంఖ్య 2,45,435 మంది. కురుబ సామాజికవర్గం ప్రాబల్యం ఈ నియోజకవర్గంలో ఎక్కువ. వారు ఎటు వైపు మొగ్గు చూపితే ఆ పార్టీదే విజయం. 2009లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి మూడు ఎన్నికలు జరిగితే రెండు సార్లు టీడీపీయే విజయం సాధించింది. పరిటాల రవి సతీమణి సునీత 2009, 2014 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. 2019లో హ్యాట్రిక్ సాధించాలని సునీత భావించినప్పటికీ.. తనయుడు పరిటాల శ్రీరామ్‌ను రాజకీయాల్లోకి దించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి 1,11,201 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి పరిటాల శ్రీరామ్‌కు 85,626 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 7,774 ఓట్ల తేడాతో పరిటాల కంచుకోటపై తొలిసారి జెండా పాతింది. 

రాప్తాడు శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. శ్రీరామ్‌కి బదులుగా సునీత :

2024 ఎన్నికల విషయానికి వస్తే.. రాప్తాడుపై పట్టును కోల్పోకూడదని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. దీనిలో భాగంగా గత ఎన్నికల్లో పరిటాల కుటుంబానికి చెక్ పెట్టిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికే మరోసారి టికెట్ కేటాయించారు. అయితే గతానికి ఇప్పటికీ పరిస్ధితులు పూర్తిగా మారిపోయాయి. 2019లో జగన్ వేవ్, పరిటాల కుటుంబం తీరు, తాను వరుసగా రెండు సార్లు ఓటమిపాలైన సానుభూతి తోపుదుర్తికి కలిసొచ్చాయి.

ఈసారి ప్రకాష్ రెడ్డికి ఆ పరిస్ధితులు లేవని నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. టీడీపీ విషయానికి వస్తే.. గత ఎన్నికల్లో కొన్ని పొరపాట్లు ఈసారి వాటిని సరిదిద్దాలని హైకమాండ్ నిర్ణయించింది. అలాగే శ్రీరామ్‌కు బదులుగా పరిటాల సునీత బరిలో దిగుతున్నారు. పరిటాల బ్రాండ్ ఇమేజ్, జగన్ పాలనపై వ్యతిరేకత, టీడీపీ జనసేన బీజేపీ కూటమి తనను గెలిపిస్తాయని సునీత ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

రాప్తాడు అంటే సెంటిమెంట్ చుట్టుకుని ఉన్న నియోజకవర్గం. ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపుతారో చూడాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios