దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో కోరిక తీర్చలేదని వివాహితను యువకులు హతమార్చిన ఘటన మరువకముందే ఇదే మండలంలోని మరో గ్రామంలో కూలీపనులకు వెళ్లిన మహిళపై కొందరు యువకులు బలత్కారానికి యత్నించిన ఘటన వెలుగుచూసింది. 

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ లో మహిళలపై అఘాయిత్యాలు మరీ ఎక్కువయ్యాయి. మొన్న విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై, నిన్న గుంటూరు జిల్లా తుమ్మపూడిలో చోటుచేసుకున్న దారుణాలు మరిచిపోకముందే తాజాగా మరో మహిళపై అత్యాచారయత్నం ఘటన బయటపడింది. మహిళను పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి యత్నించగా ధైర్యంగా ఎదిరించి మృగాళ్ల నుండి మానప్రాణాలను కాపాడుకుంది.

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని శృంగారపురం గ్రామానికి ఇతర ప్రాంతాల నుండి కూలీపనుల కోసం కొన్ని కుటుంబాలు వలసవచ్చాయి. వీరంతా గ్రామంలోని ఓ ఆలయంలో తలదాచుకుంటున్నారు. అయితే గ్రామానికి చెందిన కొందరు యువకులు ఈ కూలీల్లోని మహిళపై కన్నేసారు. ఎలాగయినా మహిళను అనుభవించాలని దారుణానికి ఒడిగట్టారు. 

గురువారం అర్థరాత్రి ఆలయంలో నిద్రిస్తున్న మహిళను బలవంతంగా దగ్గర్లోని పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు యువకులు. అయితే మహిళ ధైర్యంగా వారిని ఎదిరించింది. భయపడిపోయి యువకులకు లొంగిపోకుండా కాపాడాలంటూ గట్టిగా కేకలు వేసింది. దీంతో యువకులు మహిళను వదిలేసి పరారయ్యారు.

మహిళ కేకలు విని తోటి కూలీలతో పాటు గ్రామస్తులు కూడా ఆలయం వద్దకు చేరుకున్నారు.వారికి బాధిత మహిళ తనపై జరిగిన అత్యాచారయత్నం గురించి చెప్పడంతో డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో వెంటనే పోలీసులు గ్రామానికి చేరుకుని మహిళ నుండి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని మహిళపై అత్యాచారానికి యత్నించిన యువకులను గుర్తించే పనిలో పడ్డారు.

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం తుమ్మపుడి గ్రామంలో వివాహిత దారుణ హత్య జరిగిన 24గంటల్లోనే ఇదే నియోజకవర్గంలో మరో దారుణం వెలుగుచూడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఇలాంటి ఘటనలు జరక్కుండా వుండాలంటే నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కోరుతున్నారు. 

ఇదిలావుంటే తుమ్మపూడిలో సంచలనం సృష్టించిన మహిళ హత్యకేసు మరో మలుపు తిరిగింది. ఇప్పటివరకు ప్రచారం జరిగినట్లు మహిళపై అత్యాచారం జరగలేదని... ఇది వివాహేతర సంబంధం కారణంగా జరిగిన హత్యగా గుంటూరు అర్భన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. 

మృతురాలికి వెంకటసాయి సతీష్ అనే యువకుడితో వివాహేతర సంబంధం వుందని తెలిసిందన్నారు. అయితే బుధవారం సతీష్ స్నేహితుడు శివసత్య సాయిరాంతో కలిసి మహిళ ఇంటికి వెళ్లాడని... తన కోరిక తీర్చాలని సాయిరాం ఆమెను వేధించాడని తెలిపారు. ఇందుకు మహిళ ఒప్పుకోకపోగా ఈ విషయం అందరికీ చెబుతానని బెదిరించడంతో ఆమె చీరను మెడకు బిగించి శివసత్య సాయిరాం హతమార్చినట్లు ఎస్పీ వివరించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ హఫీజ్ వెల్లడించారు. 

అంతకుముందు వివాహిత మృతదేహాన్ని చూసేందుకు వెళ్లిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసిపి శ్రేణులు రాళ్లదాడి చేసారు. పెద్ద బండరాళ్ళను లోకేష్ పై విసరడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ దాడిలో టిడిపి, వైసిపి నాయకులతో పాటు కొందరు పోలీసులకు గాయాలయ్యాయి. వైసిపి శ్రేణులు అడ్డుకున్నప్పటికి లోకేష్ వెనక్కి తగ్గకుండా మహిళ మృతదేహానికి నివాళి అర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు.