ఆంధ్ర ప్రదేశ్ లో మృగాళ్ళు రెచ్చిపోతున్నారు. మొన్న విజయవాడలో, నిన్న తుమ్మపూడిలో ఘటనలు మరువకముందే తాజాగా విజయనగరం జిల్లాలో మరో దివ్యాంగురాలిపై అత్యాచారయత్నం జరిగింది. 

విజయనగరం: ఆంధ్ర ప్రదేశ్ లో మహిళలు, చిన్నారులపై మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలు, అభం శుభం తెలియని చిన్నారులనే కాదు చివరకు దివ్యాంగులను వదిలిపెట్టడం లేదు. కామ వాంఛ తీర్చుకోడానికి అమ్మాయితే చాలన్నట్లుగా కొందరు మగాళ్లు అతి దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈ రెండుమూడు రోజులుగా ఏపీలో వరుసగా మహిళలపై అఘాయిత్యం ఘటనలు వెలుగుచూసాయి. మొన్న విజయవాడ దివ్యాంగురాలు, నిన్న తుమ్మపూడి వివాహిత హత్యను మరిచిపోకముందే తాజాగా విజయనగరం జిల్లాలో దివ్యాంగురాలైన మైనర్ బాలికపై అత్యాచారయత్నం జరిగింది. 

వివరాల్లోకి వెళితే... విజయనగరం జిల్లా రాజాం మండలం కంచరాం గ్రామానికి చెందిన దివ్యాంగురాలైన మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన సామంతుల హరి కన్నేసాడు. ఈ క్రమంలోనే బాలికకు మాయమాటలు చెప్పి పరిచయం పెంచుకున్నాడు. ఇలా బాలిక బాలిక నమ్మకాన్ని పొందిన అతడు తాజాగా దారుణానికి ఒడిగట్టాడు. 

బాలిక స్కూల్ నుండి ఇంటికి వెళుతుండగా హరి బైక్ పై లిప్ట్ ఇస్తానంటూ వచ్చాడు. బాగా తెలిసినవాడే కావడంతో బాలిక కూడా వెంటనే అతడి బైక్ ఎక్కింది. అయితే మార్గమధ్యలో బైక్ ను ఓ తోటవద్దకు పోనిచ్చి బాలికను బలవంతంగా అందులోకి లాక్కెళ్లాడు. తోటలో యువకుడి వికృత చేష్టలకు భయపడిపోయిన బాలిక తప్పించుకునేందుకు గట్టిగా అరిచింది. దీంతో యువకుడి బాలికను తోటలోనే వదిలి పరారయ్యాడు. 

దివ్యాంగ బాలిక అరుపులు విని అటువైపుగా వెళుతున్నవారు తోటలోకి వచ్చి బాలికను కాపాడారు. ఇంటికి చేరుకున్న బాలిక తనపై జరిగిన అత్యాచారయత్నం గురించి తల్లిదండ్రులను తెలిపింది. దీంతో బాలిక తల్లిదండ్రులు రాజాం పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో వున్న నిందితుడు హరి కోసం గాలింపు చేపట్టారు.

ఇదిలావుంటే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని శృంగారపురం గ్రామంలో ఓ మహిళపై అత్యాచారయత్నం జరిగింది. ఇతర ప్రాంతాల నుండి కూలీపనుల కోసం వచ్చిన ఓ మహిళ ఆలయంలో నిద్రిస్తుండగా కొందరు యువకులు అఘాయిత్యానికి యత్నించారు. నిద్రిస్తున్న మహిళను దగ్గర్లోని తోటలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ప్రయత్నించగా ఆమె గట్టిగా అరిచింది. దీంతో భయపడిపోయిన యువకులు పరారయ్యారు. యువతి కుటుంబసభ్యుల పిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకులను అరెస్ట్ చేసారు.

ఇక తుమ్మపూడిలో సంచలనం సృష్టించిన మహిళ హత్యకేసు మరో మలుపు తిరిగింది. ఇప్పటివరకు ప్రచారం జరిగినట్లు మహిళపై అత్యాచారం జరగలేదని... ఇది వివాహేతర సంబంధం కారణంగా జరిగిన హత్యగా గుంటూరు అర్భన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. 

మృతురాలికి వెంకటసాయి సతీష్ అనే యువకుడితో వివాహేతర సంబంధం వుందని తెలిసిందన్నారు. అయితే బుధవారం సతీష్ స్నేహితుడు శివసత్య సాయిరాంతో కలిసి మహిళ ఇంటికి వెళ్లాడని... తన కోరిక తీర్చాలని సాయిరాం ఆమెను వేధించాడని తెలిపారు. ఇందుకు మహిళ ఒప్పుకోకపోగా ఈ విషయం అందరికీ చెబుతానని బెదిరించడంతో ఆమె చీరను మెడకు బిగించి శివసత్య సాయిరాం హతమార్చినట్లు ఎస్పీ వివరించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ హఫీజ్ వెల్లడించారు.

 భార్య హత్యకు అక్రమసంబంధమే కారణమంటూ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వ్యాఖ్యలపై మృతురాలి భర్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. దయచేసి తన భార్యపై నిందలువేస్తూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని... లేదంటే జీవితాంతం తాను,తనబిడ్డలు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన చెందాడు. ఎస్పీ చేత ప్రకటన ఏ పార్టీ, ఏ నాయకులు చేయించారో గానీ తమ జీవితాలను కూడా నాశనంచేసేలా ఆ వ్యాఖ్యలు వున్నాయన్నారు. మీ ఇంట్లోనూ ఆడబిడ్డలు వుండివుంటారు... అలాంటి మీకు చనిపోయిన మహిళపై ఇలాంటి నిందలెలా వేయాలనిపించింది అని ఎస్పీని అడిగారు. నా భార్యకు అక్రమ సంబంధం అంటూ మీరు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని... లేదంటే ఎస్పీ కార్యాలయం కార్యాలయం ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని మృతురాలి భర్త హెచ్చరించారు.