బాలికపై అత్యాచారయత్నం: అర్థరాత్రి పిఎస్ పై దాడి, విధ్వంసం

బాలికపై అత్యాచారయత్నం: అర్థరాత్రి పిఎస్ పై దాడి, విధ్వంసం

గుంటూరు: గుంటూరు జిల్లాలో మరో అత్యాచార యత్నం జరిగింది. మైనర్ బాలికపై ఓ యువకుడు బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన పాత గుంటూరులోని బాలాజీ నగర్ లో జరిగింది. ఆ ప్రాంతంలోని మైనర్ బాలిక రెండో తరగతి చదువుతోంది. 

ఆ ప్రాంతానికే చెందిన రఘు (20) మంగళవారం ఆ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని గమనించి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేస్తూ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. 

బాలిక విషయాన్ని స్థానికులకు చెప్పింది. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు ఆ యువకుడిని పట్టుకోవడానికి వెంటపడ్డారు. అతను అక్కడి నుంచి పారిపోయి పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. 

ఆ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు పెద్దసంఖ్యలో వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. అత్యాచారయత్నానికి పాల్పడ్డ యువకుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ స్టేషన్‌ను ముట్టడించారు. అలాగే పోలీస్‌స్టేషన్‌పై రాళ్లు రువ్వారు. దీంతో స్టేషన్ అద్దాలు ధ్వంసం కాగా రాళ్లు తగిలి పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. అలాగే స్టేషన్‌లో ఉన్న పోలీస్ జీప్, ఇతర వాహనాలకు ఆందోళనాకారులు నిప్పుపెట్టారు.

ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు లాఠీఛార్జి చేశారు. రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. అర్బన్‌ ఎస్పీ విజయరావు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు. జరిగిన ఘటనపై ఆ బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos