Asianet News TeluguAsianet News Telugu

రంజీ క్రికెటర్ కు కోడెల తనయుడి టోకరా

శివరామ్‌ స్పోర్ట్స్‌ కోటాలో రైల్వే అసిస్టెంట్‌ లోకో పైలట్‌ (ఏఎల్‌పీ) ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15 లక్షలు డిమాండ్‌ చేశాడు. దీంతో నిరుడు ఫిబ్రవరి 27న నరసరావుపేటలోని కోడెల నివాసానికెళ్లి రూ.15 లక్షలను నాగరాజు ఇచ్చాడు. అప్పుడు డబ్బు తీసుకున్నట్టు ఓ బాండ్, ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి మరుసటి రోజు కాన్పూర్‌ వెళ్లాలని శివరామ్‌ చెప్పాడు. 

Ranji trophy cricketer cheated by Kodela Shiavaram
Author
Guntur, First Published Jun 15, 2019, 10:33 AM IST

గుంటూరు: మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామ్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని ఒక క్రీడాకారుడి వద్ద శివరామ్‌ రూ.15 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు తాజాగా వెల్లడైంది. బాధితుడైన ఆంధ్రా రంజీ క్రికెటర్‌ బుడుమూరు నాగరాజు శుక్రవారం గుంటూరు రూరల్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదైంది. 

శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యవ్వారిపేట గ్రామానికి చెందిన అప్పలస్వామి కుమారుడు నాగరాజు ఆంధ్రా రంజీ జట్టు తరఫున గత ఐదేళ్లుగా క్రికెట్‌ ఆడుతున్నాడు. ఫిర్యాదు చేసిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.... రెండేళ్ల క్రితం విజయవాడకు చెందిన భరత్‌చంద్ర ద్వారా నాగరాజుకు కోడెల శివరామ్‌ పరిచయమయ్యాడు. ఆ సమయంలో తనకు రైల్వే ఉద్యోగం చేయాలని ఉందని కోడెల శివరామ్‌కు చెప్పాడు. 

దాన్ని అవకాశంగా తీసుకుని శివరామ్‌ స్పోర్ట్స్‌ కోటాలో రైల్వే అసిస్టెంట్‌ లోకో పైలట్‌ (ఏఎల్‌పీ) ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15 లక్షలు డిమాండ్‌ చేశాడు. దీంతో నిరుడు ఫిబ్రవరి 27న నరసరావుపేటలోని కోడెల నివాసానికెళ్లి రూ.15 లక్షలను నాగరాజు ఇచ్చాడు. అప్పుడు డబ్బు తీసుకున్నట్టు ఓ బాండ్, ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి మరుసటి రోజు కాన్పూర్‌ వెళ్లాలని శివరామ్‌ చెప్పాడు. 

అతడు చెప్పినట్టే నాగరాజు ఉద్యోగ నియామక పత్రాలు తీసుకుని మరుసటి రోజు కాన్పూర్‌ వెళ్లాడు. అక్కడ కోడెల శివరామ్‌కు చెందిన ఓ వ్యక్తి నాగరాజును కలిసి స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాల భర్తీ చేసేటప్పుడు కబురు చేస్తామని చెప్పాడు. దీంతో నాగరాజు తిరిగొచ్చేశాడు. 

మే 23న ఎన్నికల ఫలితాల అనంతరం కోడెల శివరామ్ పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తాను కూడా మోసపోయానని నాగరాజు నిర్ధారించుకున్నాడు. కోడెల శివప్రసాదరావుకు ఫోన్‌లో జరిగిన విషయాన్ని వివరించగా డబ్బులు తిరిగి ఇప్పిస్తానని ఆయన చెప్పాడు. దాంతో ఈ నెల 2న నాగరాజు నరసరావుపేటలోని కోడెల నివాసానికి వెళ్లాడు. 

అయితే.. నాగరాజును బెదిరించి కోడెల అనుచరులు బాండ్‌ పేపరును చించేశారు. దీంతో తాను పోలీసులను ఆశ్రయిస్తానని నాగరాజు హెచ్చరించాడు.పోలీసులకు ఫిర్యాదు చేస్తే విషయం బయటకు తెలుస్తుందని, శుక్రవారం డబ్బు ఇస్తానని నరసరావుపేట రావాలని కోడెల పిలిపించాడు. అక్కడ నాగరాజు చాలాసేపు వేచి చూసిన తర్వాత గుంటూరులోని లక్ష్మీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి దగ్గరకు వెళితే డబ్బులు ఇస్తారని అక్కడకు పంపారు.

 గుంటూరుకు వచ్చి కోడెలకు పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో జిల్లా పోలీస్‌ కార్యాలయంలో రూరల్‌ ఎస్పీకి నాగరాజు ఫిర్యాదు చేశాడు. దాంతో శివరాంపై కేసు నమోదైంది.  

Follow Us:
Download App:
  • android
  • ios