అమరావతి: కడప జిల్లాలోని రాజంపేట శాసనసభ నియోజకవర్గం పంచాయతీతో పాటు జమ్మలమడుగు నియోజకవర్గం పంచాయతీ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వద్దకు చేరింది. రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు జమ్మలమడుగు నేతలను కూడా ఆయన అమరావతికి పిలిపించుకున్నారు. 

జమ్మలమడుగు సీటుపై మంత్రి ఆదినారాయణ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కూడా పట్టుబడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ సీటును తనకే కావాలంటూ రామసుబ్బారెడ్డి, తానే పోటీ చేస్తానని ఆదినారాయణ రెడ్డి అంటున్నారు. దీంతో వారిద్దరి మధ్య తగాదాను పరిష్కరించడానికి చంద్రబాబు సిద్దపడ్డారు. 

ఒకరికి జమ్మలమడుగు శాసనసభా స్థానాన్ని, మరొకరికి కడప పార్లమెంటు సీటును కేటాయిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి వారిద్దరి మధ్య తగాదాను తీర్చే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఆదేశాలకు ఇరువురు నేతలు కట్టుబడి ఉంటారని తాను భావిస్తున్నట్లు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. 

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన ఆదినారాయణ రెడ్డిని చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి తీసుకుని ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకోవడాన్ని రామసుబ్బారెడ్డి వ్యతిరేకించారు. అయినప్పటికీ చంద్రబాబు వెనక్కి తగ్గలేదు. అప్పటి నుంచి ఇరువురు నేతల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.