Asianet News TeluguAsianet News Telugu

తీవ్రంగా నిరాశ చెందాం.. జగన్ తిరుమల పర్యటనపై రమణ దీక్షితులు సంచలన ట్వీట్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన ముగిసిన కొద్దిసేపటికే.. వంశపారంపర్య అర్చకత్వంపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కీలక కామెంట్స్ చేశారు. 

Ramana deekshitulu Express Disappointment over ys jagan tirumala tour
Author
First Published Sep 28, 2022, 3:41 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యంత్రి వైఎస్ జగన్  తిరుమలలో పర్యటించిన సంగతి తెలిసిందే. బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం సాయంత్రం సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు కూడా సమర్పించారు. బుధవారం ఉదయం సీఎం జగన్ మరోమారు శ్రీవారిని దర్శించుకున్నారు. నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని కూడా జగన ప్రారంభించారు. అయితే సీఎం జగన్ తిరుమల పర్యటన ముగిసిన కొద్దిసేపటికే.. వంశపారంపర్య అర్చకత్వంపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కీలక కామెంట్స్ చేశారు. వన్ మ్యాన్ కమిటీ రిపోర్టు అమలుపై సీఎం జగన్ ప్రకటన చేస్తారని ఆశించామని.. కానీ సీఎం ఎలాంటి ప్రకటన చేయకపోవడం వల్ల చాలా నిరాశ చెందామని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో సీఎం జగన్‌ను ట్యాగ్ చేస్తూ ఓ పోస్టు చేశారు. 

‘‘మీ తిరుమల పర్యటన సందర్భంగా వన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్ అమలుపై ప్రకటన చేస్తారని అర్చకులందరూ నిరీక్షించారు. అయితే ప్రకటన లేకపోవడంతో తీవ్రంగా నిరాశ చెందారు. టీటీడీలోని అర్చక వ్యవస్థను, ఆలయ విధానాలను టీటీడీలోని బ్రాహ్మణ వ్యతిరేక వర్గం నాశనం చేసే లోపే తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని రమణ దీక్షితులు కోరారు. 

 


తిరుమల తిరుపతి దేవస్థానంలో వంశపారంపర్య అర్చకత్వంలో ఉన్న సేవా సమస్యలను పరిశీలించడానికి, సమర్థవంతంగా అమలు చేయడానికి చర్యలను సూచించడానికి రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జూలైలో వన్ మ్యాన్ కమిటీని నియమించింది. ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి నివేదికను సమర్పించే బాధ్యతలను హైకోర్టు రిటైర్డ్ జడ్జి బి. శివ శంకర్‌రావుకు అప్పగించింది. టీటీడీలో వంశపారంపర్య అర్చక వ్యవస్థను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్చకులు, భక్తులు, ఆధ్యాత్మిక నాయకులు చేసిన విజ్ఞప్తుల మేరకు ఈ కమిటీని నియమించాలని నిర్ణయించినట్లు అప్పట్లో ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios