వజ్రం వ్యవహారం: డోలాయమానంలో రమణ దీక్షితులు పరిస్థితి

రమణ దీక్షితులు టీటీడీలోకి తిరిగి వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మిగిలిన అందరికి ఛాన్స్ ఇచ్చినప్పటికీ రమణ దీక్షితులుకు మాత్రం ఇవ్వడం లేదు ఎందుకు?

ramana deekshithulu still waiting for his re entry into ttd

తిరుమల ఆలయంలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు వేచి చూస్తున్న మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు డోలాయమాన స్థితిలో ఉన్నారు. వయసు మీదపడిందన్న కారణం తో పదవీ విరమణ చేసి ఆలయ ప్రధాన అర్చకత్వానికి దూరమయ్యాడు. 

టీటీడీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసి అప్పట్లో సంచలనానికి తెర తీశారు. టీటీడీ లోని అక్రమాల్లో టీడీపీ హస్తం ఉందని ఆరోపించారు. వైసీపీ అప్పట్లో అతనికి మద్దతు పలికింది కూడా. దీనితో ఎన్నికలు జరిగి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రమణ దీక్షితులు తిరిగి బాధ్యతలు స్వీకరిస్తారని భావించారంతా. 

ఎన్నికలకు ముందు జగన్ ను హైదరాబాద్ లో రమణ దీక్షితులు కలిసాడు. ముఖ్యమంత్రి హోదాలో తిరుపతి వచ్చినప్పుడు జగన్ ను కలుసుకొని పట్టు వస్త్రం కప్పి సత్కరించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రమణ దీక్షితులు ఇక మరోమారు ఆలయంలోకి వచ్చినట్టే అని అంతా అనుకున్నారు. టీటీడీ కొత్త పాలక మండలి తొలి సమావేశంలోనే దీనికి సంబంధించిన తీర్మానం చేస్తారనే వార్త అప్పట్లో చక్కర్లు కొట్టింది. 

కాకపోతే పాలక మండలి రెండు సమావేశాలు నిర్వహించినా ఇంతవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. వారం రోజుల కింద అర్చకుల వారసత్వ హక్కులను సమర్థిస్తూ ప్రభుత్వం చేసిన ప్రకటన చూసినవారంతా రమణ దీక్షితులుకు లైన్ క్లియర్ అయ్యిందనుకున్నారు. అర్చకులకు రిటైర్మెంట్ ఉండదని ప్రభుత్వం ప్రకటించింది. కాకపోతే ప్రభుత్వం ఈ ప్రకటనలో చిన్న మెలిక పెట్టింది. టీటీడీ మినహా మిగితా అన్ని ఆలయాలకు ఇది వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. దీనితో మరోసారి నిరాశకు గురవ్వాల్సి వచ్చింది రమణ దీక్షితులు. 

తాజాగా రెండు రోజుల కింద ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరో సారి రమణ దీక్షితులు మనసులో ఆశలు రేకెత్తించినట్టే రేకెత్తించి మళ్లీ నీళ్లు చల్లేసినట్టయింది. టీటీడీలో పదవీ విరమణ పొందిన అర్చకులను మల్లి తీసుకుంటామని అన్నారు. కాకపోతే ప్రధాన అర్చకులుగా తీసుకోలేమని, ప్రస్తుతం ఉన్న ప్రధాన అర్చకులకు స్థాన చలనం ఉండబోదని అన్నారు. 

శ్రీవారి విలువైన వజ్రమేమైందని ప్రశ్నిస్తూ దేశమంతా తిరుగుతూ,ఢిల్లీతో సహా అనేక నగరాల్లో ప్రెస్ మీట్లు పెడుతూ తీవ్ర ఆరోపణలు చేసారు. కేంద్రమంత్రులను కలుస్తూ గత చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసారు. రమణ దీక్షితులు తిరిగి తీసుకుంటే రమణ దీక్షితులు ఆరోపణలను ఒప్పుకున్నట్టవుతుంది. అంతే కాకుండా వాటిపైన వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రమణ దీక్షితులును తీసుకోవడానికి జగన్ సర్కార్ తటపటాయిస్తున్నట్టు తెలుస్తుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios