అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు టీటీడీలో రీ ఎంట్రీకి లైన్ క్లియర్ అవుతున్నట్లు తెలుస్తోంది. బుధవారం రమణ దీక్షితులు   తిరుమల తిరుపతి దేవస్థానంలో మళ్లీ అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. 

రమణ దీక్షితులు టీటీడీలో రీ ఎంట్రీకి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్ భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనార్థం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మంగళవారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. 

పద్మావతి అతిథి గృహంలో బస చేసిన వైయస్  జగన్ ను కలిసేందుకు రమణ దీక్షితులు వెళ్లారు. రమణ దీక్షితులను చూసిన వైయస్ జగన్ బుధవారం ఆలయంలో కలుద్దామని చెప్పారు. తనను ఆలయంలోకి అనుమతించడం లేదని తాను ఇప్పుడే కలుస్తానని రమణ దీక్షితులు స్పష్టం చేశారు. 

తాను ఉన్నానని బుధవారం ఆలయంలో కలుద్దామని చెప్పడంతో తన రీ ఎంట్రీకి లైన్ క్లియర్ అవుతున్నట్లు ఆనందంలో వెళ్లిపోయారు రమణ దీక్షితులు. ఇకపోతే రమణ దీక్షితులు ఎన్నికల ఫలితాలకు ముందు కడప వెళ్లి వైయస్ జగన్ ను కలిశారు. వైయస్ జగన్ కు ఆశీస్సులు అందించారు. 

అలాగే తమ తొలగింపుపై పునరాలోచించాలని జగన్ ను కోరారు. ఇకపోతే రమణ దీక్షితులు టీటీడీ ప్రధాన అర్చకులుగా ఉన్న సమయంలో వరుస వివాదాల్లో నిలిచేవారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యాలపైనా ర‌మ‌ణ దీక్షితులు బ‌హిరంగంగా ఆరోపణలు చేశారు. 

టీటీడీలో జ‌రుగుతున్న ప‌రిణామాలపై బ‌హిరంగా ఆరోప‌ణ‌లు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచేవారు ర‌మ‌ణ దీక్షితులు. అనంతరం టీడీపీ లక్ష్యంగా విమర్శలు చేయడం మెుదలుపెట్టారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 

తిరుమ‌ల లో జ‌రిగిన త్ర‌వ్వ‌కాలపై వచ్చిన ఆరోపణలు, బిజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్‌షాకు స్వాగ‌తం ప‌ల‌క‌టం, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామితో చర్చలు వంటి పరిణామాల నేపథ్యంలో అతనిపై టీటీడీ వేటు వేసింది. 

పాత ఉత్త‌ర్వుల ఆధారంగా ప్ర‌ధాన ఆర్చ‌కుల హోదా నుంచి తొలిగించారు. రమణ దీక్షితుల తొలగింపుపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రమణ దీక్షితులకు మద్దతు పలికింది. జగన్ అధికారంలోకి రావడంతో రమణ దీక్షితులు రీ ఎంట్రీ కన్ఫమ్ కానున్నట్లు తెలుస్తోంది.