విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరితపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్ లు పెట్టిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేరం జరిగిన ప్రతీచోటా కాపలా ఉండలేమని హోం మంత్రి సుచరిత వ్యాఖ్యలపై విశాఖపట్నంకు చెందిన రాం మహారాజ్ అసభ్యకర పోస్టింగ్ లు పెట్టారు. 

హోంమంత్రి సుచరితపై అసభ్యకర పోస్టింగ్ లపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు ఆదేశించారు. 

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్ లు పెట్టిన రాం మహారాజ్ ను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక ప్రజాప్రతినిధి అందులోనూ మహిళపై అసభ్యకర పోస్టింగ్ లు పెట్టినందుకు పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. 

అలాగే ఎస్సీ,ఎస్టీ యాక్ట్ కింద కూడా  కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం నిందితుడిని రిమాండ్ కు తరలించారని తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు పోలీసులు.