విజయవాడ:  ఏపీలో టీడీపీ కనుమరుగు కావడం ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ చెప్పారు. తానా సభలకు మాత్రమే టీడీపీ పరిమితం కానుందని ఆయన ఎద్దేవా చేశారు.

ఆదివారం నాడు విజయవాడలో జరిగిన  బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో  ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఏపీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా  సహాయం  చేస్తోందన్నారు. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం  అనేక అవకతవకలకు పాల్పడినట్టుగా ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కూడ వ్యవహరిస్తే  పెనం నుండి పొయ్యిలోకి పడినట్టేనన్నారు.

తమకు  అవకాశాన్ని ఇస్తే ఏపీని సుందరంగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు.  అయితే  ఏపీలో  బీజేపీని  మరింత బలోపేతం చేసేందుకు గాను   ప్రతి ఒక్కరూ కృషి చేయాలని  ఆయన  కోరారు. గతంలో  ఏపీలో 25 లక్షల మంది సభ్యులుగా ఉన్నారని... ఈ దఫా ఏపీలో బీజేపీ సభ్యుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్ర జనాభాకు అనుగుణంగా  బీజేపీ సభ్యత్వం ఉండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ప్రతి ఒక్కరు కూడ కనీసం 25 మందిని పార్టీ సభ్యులుగా చేర్పించాలని  ఆయన సూచించారు.