జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సంచలన కామెంట్స్ చేశారు. ఆయన రాజోలు నియోజకవర్గంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. అందులో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. 

రాజోలు నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి చేశామని.. మళ్లీ ఇప్పుడు చేస్తున్నామన్నారు. 2019లో వైఎస్సార్‌సీపీ తరపున టికెట్ కోసం ప్రయత్నించానని.. టికెట్ ఇవ్వడానికి జగన్ కూడా ఒప్పుకున్నారని చెప్పుకొచ్చారు. టికెట్ తనకే దక్కిందని తాను సంబరాలు చేసుకున్నానని చెప్పాడు. అయితే చివరి నిమిషంలో తనకు కాకుండా మరో వ్యక్తికి టికెట్ ఇచ్చారని రాపాక పేర్కొన్నాడు.

ఆ తర్వాత జనసేన కి చెందిన ఓ వ్యక్తి వచ్చి తనను ఆ పార్టీలో చేరమని  చెప్పాడని.. దీంతో తాను చేరానని చెప్పాడు. జనసేన టికెట్ తాను గెలిచిన తర్వాత కూడా జగన్ ని కలిసినట్లు చెప్పాడు.  టికెట్ ఇవ్వలేకపోయానని సీఎం తనతో అన్నారని.. అయినా సరే కలిసి పని చేద్దామని చెప్పారని.. అప్పటి నుంచి కలిసి పనిచేస్తున్నామన్నారు. రాజోలు నియోజకవర్గానికి నిధులు సీఎం జగన్ నిధులు కేటాయించారని చెప్పుకొచ్చారు.

తాను పేరుకి మాత్రమే జనసేన ఎమ్మెల్యే అని.. తాను వైసీపీ కోసమే పనిచేస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం. తాను నెగ్గిన పార్టీ నిలబడేది కాదు.. ఉంటుందో లేదో కూడా తెలియదన్నారు. బయటి కులాల నుంచి సపోర్ట్‌తో గెలిచానని.. మిగతా చోట్లా ఎక్కడా గెలవలేదు.. ఆయనే విజయం సాధించలేదని పవన్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిని బట్టి పార్టీపై ఇష్టం లేకపోయినా తనకు అందరూ మద్దతు ఇచ్చారని.. వైఎస్సార్‌సీపీలో వర్గాలు ఉండొచ్చు.. అధినేత ఒక మాట చెబితే గొడవలు ఉండవన్నారు. ఇప్పటికే ఇద్దరు నేతలు ఉన్నారు.. అందర్ని కలుపుకుని వెళతాను అన్నారు.