తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 2008లో చేపట్టిన నియోజవకర్గాల పునర్వ్యవస్థీకరణలో కడియం అసెంబ్లీ స్థానంలో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ ఏర్పాటుచేసారు. ఇప్పటివరకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో మూడుసార్లు (2009,2014, 2019) అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అన్నిసార్లు టిడిపిదే విజయం. ఈ సారి ఎలాగైనా రాజమండ్రి రూరల్ లో గెలిచితీరాలని వైసిపి పట్టుదలతో వుంది. మరి రాజమండ్రి రూరల్ ప్రజల తీర్పు ఎలా వుంటుందో చూడాలి.
రాజమండ్రి రూరల్ రాజకీయాలు :
రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఇప్పటికే వరుసగా రెండుసార్లు (2014, 2019) గెలిచి సత్తా చాటారు. అయితే ఇక్కడ జనసేన పార్టీ కూడా బలంగా వుండటం... రెండు పార్టీల మధ్య పొత్తు కుదరడంతో ఈ సీటు ఎవరికి దక్కుతుందన్న సందిగ్దత ఏర్పడింది. అయితే గోరంట్ల కోసం జనసేన రాజమండ్రి రూరల్ సీటును త్యాగం చేయాల్సివచ్చింది. ఈ సీటును ఆశించిన కందుల దుర్గేష్ నిడదవోలుకు షిఫ్ట్ అయ్యేందుకు ఒప్పుకోవడంతో గోరంట్లకు లైన్ క్లియర్ అయ్యింది.
ఇక వైసిపిలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. రాజమండ్రి రూరల్ సీటును పలువురు వైసిపి నేతలు ఆశించినా ఆ పార్టీ అదిష్టానం మాత్రం అక్కడ బలమైన నేతను బరిలోకి దింపేందుకు సిద్దమయ్యింది. దీంతో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా ఎంపికచేసింది.
రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. రాజమండ్రి రూరల్ మండలం
2. కడియం
3. రాజమండ్రి మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 1 నుండి 6, 36 నుండి 41 మరియు 90 వార్డులు
రాజమండ్రి రూరల్ అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,54,432
పురుషులు - 1,24,760
మహిళలు - 1,29,660
రాజమండ్రి రూరల్ అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను రాజమండ్రి రూరల్ బరిలో దింపుతోంది వైసిపి. ఆయన ప్రస్తుతం రామచంద్రాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా అక్కడినుండి రాజమండ్రి రూరల్ కు మార్చింది వైసిపి అదిష్టానం.
టిడిపి అభ్యర్థి :
ఇక టిడిపి-జనసేన కూటమి మధ్య రాజమండ్రి రూరల్ సీటు విషయంలో సందిగ్దత క్లియర్ అయ్యింది. ఈ సీటును టిడిపికే వదిలేసేందుకు జనసేన ఒప్పుకుంది... దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికీ మరోసారి పోటీచేసే అవకాశం దక్కింది.
రాజమండ్రి రూరల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;
రాజమండ్రి రూరల్ అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,87,725
టిడిపి - గోర్లంట్ల బుచ్చయ్యచౌదరి - 74,166 (39 శాతం) - 10,404 ఓట్ల మెజారిటీతో గెలుపు
వైసిపి - ఆకుల వీర్రాజు - 63,762 (33 శాతం) - ఓటమి
జనసేన పార్టీ - కందుల దుర్గేష్ - 42,685
(22 శాతం)
రాజమండ్రి రూరల్ అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,67,626 (73 శాతం)
టిడిపి - గోర్లంట్ల బుచ్చయ్య చౌదరి - 87,540 (52 శాతం) - 18,058 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - ఆకుల వీర్రాజు - 50,000 (41 శాతం) - ఓటమి
